రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, అంగన్ వాడి కేంద్రాలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పారిశుద్ద్య పనులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలి- రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.


సెప్టెంబర్ 01 నుండి అంగన్ వాడి కేంద్రాలు సహా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్
పాఠశాలలు పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినందున రాష్ట్రంలోని
అన్ని పాఠశాలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పారిశుద్ద్య పనులు పూర్తి చేసి
సిద్ధంగా ఉంచాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి
అన్నారు.
మంగళవారం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, జిల్లా పరిషత్ చైర్
పర్సన్లు, మున్సిపల్ నగర పాలక సంస్థ చైర్మన్లు, జిల్లా విధ్యాధికారులు,
జిల్లా పంచాయితీ అధికారులతో పాఠశాలల పునః ప్రారంభం, పారిశుద్ద్య పనుల
నిర్వాహణ పై రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా
రెడ్డి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ కోవిడ్
కారణంగా పాఠశాలలు 16 నెలల తర్వాత సెప్టెంబర్ 01 నుండి
ప్రారంభించుకుంటున్నామని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా
పాఠశాలల్లో పారిశుద్ద్య పనులు చేపట్టాలని అన్నారు. పాఠశాలల్లో ప్రతి
తరగతి గదిని, ఫర్నిచర్ ను శుభ్రపరచాలని అన్నారు. పాఠశాలను నీటితో
కడిగించాలని, ముఖ్యంగా మరుగుదొడ్లను శుభ్రపరచాలని, పాఠశాలల్లో ఉండే
కిచెన్ షెడ్డులను ప్రత్యేకంగా శుభ్రపరచాలని, ప్రతి పాఠశాలకు మిషన్ భగీరథ
ద్వారా నల్లా నీరు సరఫరా ఉండేలా చర్యలు తీసుకోనాలని తెలిపారు.
విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్క
విద్యార్థి తప్పని సరిగా మాస్కులు ధరించి పాఠశాలలకు రావాలని, అందుకు తగిన
చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలో కూడా పారిశుద్ద్య పనులు
చేపట్టేలా జిల్లా విద్యాధికారులు పర్యవేక్షించాలని, ప్రైవేట్ పాఠశాలల
బస్సులలో విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకొవాలని
అన్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల పారిశుద్ద్య చర్యల భాద్యత సంబంధిత
గ్రామ పంచాయితీదేనని తెలిపారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో
పారిశుద్ద్య పనులలో గ్రామ సర్పంచు, ఎం.పి.పి.లు, జడ్పీటిసిలు, వార్డు
మెంబర్లు, ఇతర ప్రజాప్రతినిధులందరూ భాగస్వామ్యులు కావాలని అన్నారు.
ఆగష్టు 30 లోగా అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు పూర్తిస్థాయిలో
పారిశుద్ద్య చర్యలు నిర్వహించి ప్రారంభానికి సిద్ధంగా ఉంచినట్లు సంబంధిత
ప్రధానోపాధ్యాయులు సర్టిఫికెట్ ను ఇవ్వాలని అన్నారు.
పాఠశాలలు ప్రారంభం అయిన తర్వాత ప్రతి రోజు కలెక్టర్లు, జిల్లా
విద్యాధికారులు, జిల్లా పంచాయితీ అధికారులు, ఎం.పి.డి.వో.లు, మండల
విద్యాధికారులు, మండల పంచాయితీ అధికారులు పాఠశాలలను సందర్శిస్తూ
పారిశుద్ద్య చర్యలను కొనసాగేలా చర్యలు గైకోనాలని సూచించారు. కోవిడ్
నిబంధనల మేరకే స్వచ్చందంగా వచ్చే విద్యార్థులకు పాఠశాలల్లో అన్ని
ఏర్పాట్లు చేయాలని సూచించారు. పాఠశాలలో ఏదేనీ ఒక విద్యార్థి దగ్గు,
జలుబు, జ్వరము వంటి కోవిడ్ లక్షణాలతో ఉంటే వెంటనే సంబంధిత ప్రాథమిక
ఆరోగ్య కేంద్రములో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించాలని
ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థికి కోవిడ్ పాజిటివ్ గా
నిర్ధారణ అయిన పక్షంలో విద్యార్థి ఆ తరగతి గదిలో ఉన్న ప్రైమరీ కాంటాక్ట్
విద్యార్థులను గుర్తించి అందరికి కొవిడ్ పరీక్షలు చేయించాలని అన్నారు.

రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ
అన్ని పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాలలో పకడ్బందీ పారిశుద్ద్య చర్యలు
చేపట్టి పండుగ వాతావరణంలో సెప్టెంబర్ 01న పాఠశాలలను ప్రారంభించాలని,
ప్రతి రోజు పాఠశాలల్లో పారిశుద్ద్య పనులు గ్రామ పంచాయితీ ద్వారా
నిర్వహించాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణలో ఉండే పిచ్చి మొక్కలను
తొలగించాలని, నిల్వ నీటిని లేకుండా మట్టి వేయించాలని అన్నారు. అన్ని
పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీలు, పూర్వవిద్యార్థుల కమిటీలు ఏర్పాటు చేసి
పరిశుభ్రమైన పరిసరాలలో పాఠశాలల్లో విద్యా భోదన చేయుటకు చర్యలు
తీసుకొవాలని సూచించారు. పూర్వ విద్యార్థుల నుండి డోనేషన్లు స్వీకరించి
పాఠశాలల్లో వైట్ వాషింగ్ ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు.
అన్ని పాఠశాలల పారిశుద్ద్య పనుల నిర్వాహణ బాద్యత గ్రామ పంచాయితీలదేనని
పంచాయితీ రాజ్ చట్టంలో ఉందని మంత్రి అన్నారు. ప్రతి పాఠశాలల్లో మిషన్
భగీరథ నీళ్లు వచ్చేలా, పైప్ లైన్ల మరమత్తులు
ఉంటే సరిచేయాలని పాఠశాలను సందర్శించి నల్లాలు లేనిచోట నల్లాలు
అమార్చాలని సంబంధిత ఏ.ఈ.లకు ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాత్కాలిక
మరమ్మత్తులు ఉంటే వెంటనే చేయించాలని అన్నారు. పాఠశాలల ప్రారంభాన్ని ప్రతి
ఒక్కరూ చాలెంజ్ గా తీసుకొని పాఠశాలల్లో పకడ్బందీ పారిశుద్ద్య పనులు
చేపట్టాలని అన్నారు. పారిశుద్ద్య పనులు నిర్వాహణలో నిర్లక్ష్యం వహించిన
అధికారులు, ప్రజాప్రతినిధుల పై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి
విద్యార్థి మాస్కు ధరించి పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకొవాలని జిల్లా
విద్యాధికారులకు సూచించారు. పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సంబంధిత ప్రాథమిక
ఆరోగ్య కేంద్రాల డాక్టర్లతో సమన్వయం చేసుకొవాలని అన్నారు. అన్ని
పాఠశాలల్లో బ్లిచింగ్, లైమ్ చల్లించాలని, త్రాగునీటి ట్యాంకులను
క్లోరినేట్ చేయించాలని అన్నారు. అన్ని మున్సిపాలిటీలలో, నగరపాలక సంస్థల
పరిధిలోని పాఠశాలలో, అంగన్వాడీ కేంద్రాలలో ఈగలు, దోమలు లేకుండా పరిసరాలను
పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు.
ఈ సందర్బంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ
సెప్టెంబర్ 01 నుండి పాఠశాలల పునః ప్రారంభానికి అవసరమైన పారిశుద్ద్య
పనులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచుతామని తెలిపారు. జిల్లాలోని అన్ని
విద్యాసంస్థలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలలో స్పెషల్ డ్రైవ్ ద్వారా
పారిశుద్ద్య చర్యలు నిర్వహించుటకు జిల్లా విద్యాధికారికి, జిల్లా
పంచాయితీ అధికారికి, మండల విద్యాధికారులకు, మండల పంచాయితీ అధికారులకు,
ఎం.పి.డి.వో.లకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. అన్ని పాఠశాలల్లో
మిషన్ భగీరథ ద్వారా త్రాగు నీరు సరఫరాకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
తమరు సూచించిన విధంగా అన్ని రకాల చర్యలు చేపట్టి విద్యార్థులకు ఎలాంటి
ఇబ్సందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.
అనంతరం రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనిత హరనాథ్ రెడ్డి
మాట్లాడుతూ విద్యార్థులు ఎన్నో నెలలుగా ఎదురుచుస్తున్న విధంగా ప్రభుత్వం
సెప్టెంబర్ 01 నుండి పాఠశాలలు ప్రారంభించడం సంతోషకరమని, ప్రభుత్వ ఆదేశాల
ప్రకారము జిల్లాలోని అన్ని పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాలలో అధికారులు,
ప్రజాప్రతినిధులు భాగస్వామ్యంతో పకడ్బందీగా పారిశుద్ద్య చర్యలు
నిర్వహించి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పాఠశాలల ప్రారంభానికి
సిద్ధం చేస్తామని పారిశుద్ద్య చర్యలల్లో అందరూ సర్పంచులు, ఎం.పి.పి.లు,
జడ్పీటిసీలు, వార్డు మెంబర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యులు
చేస్తామని తెలిపారు.
ఈ వీడియో కాన్పరెన్సులో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్
కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, పురపాలక శాఖ కమిషనర్
సత్యనారాయణ, అదనపు తిరుపతి రావు, జిల్లా విద్యాధికారి, జిల్లా పంచాయితీ
అధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిషత్ సి.ఈ.ఓ దిలీప్ కుమార్,
సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post