రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ఫలాలు అందించడం తెలంగాణ ప్రభుత్వ ఘనత

ప్రజల సంక్షేమం, అభివృద్ధితో పాటు రాష్ట్రంలోని అన్ని రంగాలను ముందుంచేలా చేయూతనివ్వడంతో పాటు రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తూ సంక్షేమ పథకాల ఫలాలను అర్జులైన ప్రతి ఒక్కరికి అందించడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఘనత అని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం జిల్లాలోని లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, న్యాయ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ శాసనసభ్యులు బాల్మ సుమన్‌, జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి, జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, శాసన మండలి సభ్యులు పురాణం సతీష్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్మన్‌ నల్లాల భాగ్యలక్ష్మీ, మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్‌రావు, ట్రైనీ కలెక్టర్‌ ప్రతిభా సింగ్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో రాష్ట్ర మంత్రి వర్యులు మాట్లాడుతూ ఒకప్పుడు గ్రామాలలో నీరు అందుబాటులో ఉండేవి కావని, ఇప్పుడు ప్రతి ఇంటికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిషన్‌ భగీరథ పథకం ద్వారా శుద్ధజలం అందించడం జరుగుతుందని, ఒక్క వెంకట్రావుపేట గ్రామానికే 2 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని, కర్ణాటకలో ఒక అమ్మ అడిగిందని 500 రూపాయలు అందించామని చెప్పుకుంటున్నారని, మన రాష్ట్రంలోని ఒక్క వెంకట్రావుపేట గ్రామంలోనే దాదాపు 1 కోటి రూపాయలు అందిస్తున్నామని తెలిపారు. ఆడపడుచు పెళ్ళికి మేనమామ ఖర్చు పెట్టేవారని, రాష్ట్ర ముఖ్యమంత్రి మేనమామగా పేదింటి ఆడపడుచులకు 1 లక్షా 50 వేల రూపాయలు అందిస్తున్నారని తెలిపారు. గ్రామాలన్నీ శుభ్రంగా ఉండేందుకు ప్రతి గ్రామంలో డంపింగ్‌ యార్జు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరైనా మృతి చెందితే దహన సంస్కారాల కోసం వైకుంఠధామం (శ్మశానవాటిక) ఏర్పాటు చేయడం జరిగిందని, హరితహారంలో నాటిన మొక్కలకు నీరు పోయడంతో పాటు చెత్త, చెదారాన్ని డంపింగ్‌ యార్డుకు తరలించేందుకు ట్రాక్టర్లు, ట్రాలీలు అందించడం జరిగిందని తెలిపారు. వర్షాకాలం కావడంతో అంటువ్యాధులు ప్రబలకుండా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఏ విద్యార్థి ‘ఫైవేట్‌ పాఠశాలలకు వెళ్ళకుండా ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించడం జరిగిందని, తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా నిర్ధేశిత లక్ష్యాలను సాధించాలని, ప్రతి ఇంట్లో 6 మొక్కలు నాటి సంరక్షించే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అయిన తరువాత కె.సి.ఆర్‌. కిట్‌తో పాటు 18 వేల రూపాయలు అందించి జాగ్రత్తగా ఇంటికి చేర్చడం జరుగుతుందని, అర్హులైన ప్రతి నిరుపేదకు ఇల్లు ఇవ్వడం జరుగుతుందని, రైతు సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తూ రైతుబంధు, రైతు భీమా పథకాలు అమలు చేయడం జరుగుతుందని, రైతుల తరుపున 12 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించడం జరిగిందని తెలిపారు. దళిత సాధికారత పథకం ద్వారా అర్హులైన దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయలు అందించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా ప్రతి గ్రామపంచాయతీకి నిధులు అందించడం జరుగుతుందని, ఇందులో నుండి 10 శాతం నిధులు మొక్కలు నాటి సంరక్షించేందుకు ఖర్చు చేయాలని, దీని ద్వారా భావి రాలకు మంచి ఆక్సిజన్‌ అందించడం జరుగుతుందని అన్నారు. వెంకట్రావుపేట గ్రామంలో దేవతలు వెలిసిన రామాలయం అభివృద్ధి కొరకు శాఖ పరంగా 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్‌ చట్టంను అనుసరించి నిధులు ఖర్చు చేయడం ద్వారా పల్లెలను చాలా అందంగా తీర్చుదిద్దుకోవచ్చని, ప్రజల భాగస్వామ్యంతో ప్రతి పల్లె బాగు చేసుకోవచ్చని అన్నారు. హరితహారం కార్యక్రమం గొప్ప కార్యక్రమమని, కాలుష్యం లేని వాతావరణం అందించడం ద్వారా భవిష్యత్‌ తరాలు బావుంటాయని, పల్లెలు పరిశుభ్రంగా ఉంచుకుందాం – అందరం ఆరోగ్యంగా ఉందామని తెలిపారు. మంచిర్యాల శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆలోచనతో పెద్ద ఎత్తున చెట్లు పెంచడం వలన సకాలంలో వర్షాలు కురుస్తున్నాయని, ప్రతి గ్రామానికి ప్రభుత్వ పథకాలు అందించబడుతున్నాయని, రైతుల సంక్షేమం కోసం రైతుబంధు అనే బృహత్తర కార్యక్రమం అమలు చేయడం జరుగుతుందని, అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులు అందించడం జరుగుతుందని తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు క్రింద గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా 2 వందల కోట్ల రూపాయల విలువ గల పంట పండిందని అన్నారు. అంతకు ముందు హాజీపూర్‌ మండలంలోని గుడిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన తెలంగాణ హరితహారం కార్యక్రమంలో రెజువేషన్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ సంబంధిత శిలాఫలకాన్ని ఆవిష్కరించి మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధుల పేర్లపై మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాలలో డి.సి.ఎం.ఎస్‌. చైర్మన్‌ తిప్పని లింగయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రేణికుంట్ల ప్రవీణ్‌, జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, స్ధానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post