రాష్ట్రంలో కురుస్తున్న బారీ వర్షాల వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తు చర్యలతో జిల్లా, మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా తమ తమ కార్యస్థానాలలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు సూచించారు.

ప్రచురణార్ధం

ఆగష్టు 30 ఖమ్మం:

రాష్ట్రంలో కురుస్తున్న బారీ వర్షాల వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తు చర్యలతో జిల్లా, మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా తమ తమ కార్యస్థానాలలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్లు, పోలీసు కమీషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో నీటిపారుదల, రోడ్లు భవనాలు, పంచాయితీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చేపట్టవలసిన ముందస్తు చర్యలపై ముఖ్య కార్య దర్శి సోమేషుమార్ పలు సూచనలు ఆదేశాలు చేసారు. ఈ సందర్భంగా సోమేష్ కుమార్ మాట్లాడుతూ. రాష్ట్రంలోని పలు జిల్లాలలో గత నాలుగైదు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలకు ఎటువంటి నష్టం సంభవించకుండా అధికారులందరూ తప్పనిసరిగా తమ తమ కార్యస్థానాలలో ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని, కాలువలు, చెరువులు, ఇతర నీటి ప్రవాహాలవల్ల నష్టం సంభవించే ప్రాంతాలను, నీటి వనరులను ముందుగానే గుర్తించి అవసరమైన రక్షణ చర్యలు, మరమ్మత్తులు చేపట్టాలని, ప్రజలెవ్వరూ వాగులు, వంతెనలు దాటే ప్రయత్నాలు చేయకుండా అప్రమత్తం చేయాలని ముఖ్య కార్యదర్శి జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఈ నెల 31 న ప్రభుత్వ సెలవు అయినప్పటికీ నీటి పారుదల శాఖ అధికారులందరూ తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించి వాగులు, వంతెనలు పొంగడం ద్వారా ప్రజలకు ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రెవెన్యూ, పోలీసు, రోడ్లు భవనాలు, నీటిపారుదల, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయితీరాజ్ శాఖాధికారులు సమన్వయంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గేవరకు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. జిల్లాలలోని చిన్న, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వద్ద ముందస్తు చర్యలతో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ అధిక వర్షాలవల్ల జిల్లాలో ఎటువంటి నష్టం సంభవించకుండా అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందని, జిల్లా, మండల స్థాయి అధికారులందరూ తమ తమ కార్యస్థానాలలో ఉండి ముందస్తు రక్షణ చర్యలకై ఆదేశించడం జరిగిందని జిల్లాలోని చిన్న, మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వల్ల ప్రజలకు ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా తగు ముందస్తు చర్యలతో సన్నద్ధంగా, అప్రమత్తంగా ఉన్నామని కలెక్టర్ వివరించారు.

పోలీసు కమీషనరు విష్ణు. యస్. వారియర్, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్. మధుసూధన్, శిక్షణ కలెక్టరు బి.రాహుల్, నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమీషనర్ మల్లీశ్వరీ, జిల్లా పంచాయితీ అధికారి ప్రభాకర్రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా॥మాలతీ, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా॥బి, వెంకటేశ్వర్లు, పంచాయితీరాజ్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు జి.వి. చంద్రమౌళీ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అప్పారావు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్ తదితరులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post