రాష్ట్రంలో పండుగలా వ్యవసాయం – కలెక్టర్

నందిపేట్ (నిజామాబాద్), జనవరి 11:– రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పలు కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో వ్యవసాయం ఒక పండుగలా సాగుతోందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు.

రైతుబంధు ఉత్సవాలలో భాగంగా మంగళవారం నందిపేట మండలం నూత్ పల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పదేళ్ల క్రితం చూసుకుంటే వ్యవసాయం సాగు లో పలు సమస్యలు ఎదుర్కొన్నామని ముఖ్యంగా విద్యుత్తు సమస్య సమయానికి ఎరువులు విత్తనాలు అందకపోవడం పెట్టుబడికి వడ్డీ వ్యాపారం ఆశ్రయించడం తదితర సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏ దేశంలో లేని విధంగా రైతులకు ప్రతి సంవత్సరానికి ఎకరాకు పదివేల రూపాయల పెట్టుబడి సహాయం అందిస్తుందని తద్వారా రైతులు మొత్తం తో వ్యవసాయానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలిపారు. అంతేకాక ఎరువుల కోసం ఎన్నో అవస్థలు పడ్డామని ప్రస్తుతం సకాలంలో ఎరువులు విత్తనాలు అందించడంలో ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నదని తెలిపారు. అంతేకాక బ్యాంకులు ఏ కొందరికో పలుకుబడి ఉన్న వారికి మాత్రమే పంట రుణాలు అందించేవని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లతో సమీక్షలు నిర్వహించి ఇవ్వడానికి అడ్డంకులు కల్పించకుండా బ్యాంకర్ల రైతుల వద్దకు వెళ్లి కేవలం పట్టాదారు పాస్ పుస్తకం ఉంటే పంట రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవడం ద్వారా సకాలంలో ప్రతి రైతుకు పంట రుణాలు అందుతున్నాయని అన్నారు. వీటితో పాటు రైతు బీమా అమలు చేయడం ద్వారా దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబానికి 5 లక్షల బీమా మొత్తంతో ఆర్థికంగా నిలదొక్కుకునేలా సహాయం జరుగుతుందన్నారు. తద్వారా గత నాలుగు సంవత్సరాల కంటే ముందు ప్రస్తుతం వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరిగే మంచి దిగుబడులు రావడం ద్వారా వ్యవసాయ భూములకు డిమాండ్ పెరిగి మార్కెట్లో మంచి ధరలు వస్తున్నందున రైతులకు ఒక భరోసాగా నిలుస్తుందని పేర్కొన్నారు.

రైతులు మరింత అభివృద్ధి పథంలో వెళ్లడానికి మంచి దిగుబడులు సాధించి ఆర్థిక అభివృద్ధి సాధించడానికి మార్కెట్లు డిమాండ్ ఉన్న పంటల సాగుకు ముగ్గు చూపాలని కోరారు. వ్యవసాయ అధికారుల సూచనలు ప్రభుత్వం అందిస్తున్న చేయూతను అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. ఇప్పటికే ఈ విషయంలో రైతులకు కొంతమేర అవగాహన రావడం ద్వారా ఇప్పుడిప్పుడే డిమాండ్ ఉన్న పంటల వైపు మొగ్గుచూపుతున్నారని ఈ యాసంగిలో వరిసాగులో 64% సన్నాలు సాగు చేస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులకు 50 వేల కోట్ల రూ.లు, జిల్లాలో 2.45 లక్షల మంది రైతులకు 1825 కోట్ల రూపాయలు రైతుబంధు కింద అందించినందుకు గాను కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మొక్కలు నాటి నీరు పోశారు. రైతుబంధు ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రంగోలి విజేతలను అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, గ్రామ సర్పంచ్ రవి అధ్యక్షత వహించగా, ఎంపీపీ సంతోష్, భరత్ రెడ్డి, సుదర్శన్, దేవేందర్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post