రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున రెవిన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు ముందస్తు ఏర్పాట్లతో అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, జరుగకుండా ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్లను ఆదేశించారు.
గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాల కారణంగా తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం రాష్ట్ర డిజిపి శ్రీ మహేందర్ రెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల వారీగా సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా సీ.ఎస్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలతో చెరువులు, కుంటలు, వాగులు, డ్యాములు నిండాయని, అదేవిధంగా గత రెండు మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాల వలన ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, మంగళ వారం 31 న కృష్ణాష్టమి సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నా కూడా అధికారులందరూ తమ హెడ్క్వార్టర్స్ లోనే ఉండి పరిస్థితులను పరిశీలించాలని, క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. గ్రామ సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు, మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని , చేపలు పట్టడానికి చెరువులు, వాగుల దగ్గరికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, వర్షాల వలన ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉండాలని, ఎలాంటి నష్టం జరగకుండ అధికారులు సమన్వయంతో టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని తెలిపారు. ప్రమాద ప్రాంతాలకు ఎవరినీ వెళ్లనీయకుండా పోలీసు, రెవెన్యూ యంత్రాంగం కఠినంగా నిరోధించాలని తెలిపారు. అవసరమైనచోట ట్రాఫిక్ మళ్లించాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో వర్షాల పడుతున్న కారణంగా అధికారులు అప్రమత్తంగా ఉన్నారని, ఎప్పటికప్పుడు పరిస్థితులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తామని తెలిపారు. జిల్లాలో 792 చెరువులు ఉన్నాయని, గ్రామాలలో గ్రామ టీములు, మండలాల్లో మండల టీం లు , అలాగే మున్సిపాలిటీ టీముల ఏర్పాటు చేసి అప్రమత్తంగా ఉంటామని . జిల్లా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని , 24 గంటల పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ లో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, అదనపు కలెక్టర్లు ప్రతీక్ జైన్, తిరుపతి రావు, జిల్లా పరిషత్ సీఈవో దిలీప్ కుమార్ ,డీఆర్ డీ ఏ పీడీ ప్రభాకర్, ఇరిగేషన్ ఎస్.ఈ హైదర్ ఖాన్, డీ.ఈ బన్సీలాల్, ఆర్ అండ్ బీ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి , వ్యవసాయ శాఖ అధికారి గీత, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.