రాష్ట్రంలో మొదటి విడత 9,123 ప్రభుత్వ పాఠశాలల్లో రూ.3497 .62 కోట్లతో మన ఊరు – మన బడి కార్యక్రమం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు సీఎస్ సోమేశ్ కుమార్

పత్రిక ప్రకటన

తేదీ : 02–05–2022

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మన ఊరు- మన బడి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి కావాలి

రాష్ట్రంలో మొదటి విడత 9,123 ప్రభుత్వ పాఠశాలల్లో రూ.3497 .62 కోట్లతో మన ఊరు –  మన బడి కార్యక్రమం

జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్‌రావు, సీఎస్ సోమేశ్ కుమార్

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో  రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన మన ఊరు -–  మన బడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,  ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని బీఆర్కేఆర్ భవన్ నుంచి జిల్లా కలెక్టర్లతో మన ఊరు –  మన బడి కార్యక్రమంపై  మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్బంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ.. మన ఊరు- –  మన బడి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించామని వివరించారు.  అందుకోసం ఈ కార్యక్రమం కింద మొదటి దశలో  రాష్ట్రంలోని  9,123 పాఠశాలల్లో రూ.3497 .62 కోట్లతో 12 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. అలాగే  రూ. 30 లక్షల లోపు పనులను పాఠశాల నిర్వహణ కమిటీలకు అప్పగించామని…  రూ.30 లక్షల పైబడి పనులను టెండర్ల ద్వారా చేపడుతున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి  హరీష్ రావు మాట్లాడుతూ మన ఊరు –  మన ఊరి బడి కార్యక్రమానికి నిధుల కొరత లేదని… ఇప్పటికే అన్ని జిల్లాలకు అడ్వాన్స్‌గా  నిధులు విడుదల చేశామని పేర్కొన్నారు.  విద్యను యజ్ఞంగా చేపట్టిన  మన ఊరు – మన బడి కార్యక్రమంలో మంజూరు చేసిన పనులన్నింటినీ సీనియర్ అధికారులతో తనిఖీ చేయించాలని వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు సూచించారు.  పనుల ప్రారంభానికి ముందు పాఠశాల  పరిస్థితి  ఎలా ఉంది ?  పనులు చేసిన తర్వాత ఏవిధంగా ఉందనే దానిపై ఫొటోలు తీయించాలని మంత్రి హరీశ్ రావు వివరించారు.  ప్రతీ మండలానికి  ఒక ప్రత్యేక అధికారిని నియమించి పనులను నాణ్యతతో, త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు.       రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ… రూ. 30 లక్షల లోపు పనులన్నింటికీ ఈ నెల 10వ తేదీ లోగా పరిపాలన సంబంధిత మంజూరీ చేసి 15వ తేదీ నాటికి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రూ. 30 లక్షలకు పైబడ్డ పనులకు ఈనెలాఖరు వరకు టెండర్ల పక్రియను పూర్తి చేసి పనులను చేపట్టాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో  విద్యా శాఖ కార్యదర్శి సందీవ్ కుమార్ సుల్తానియా, డైరెక్టర్ దేవసేన తదితరులు పాల్గొన్నారు.

జిల్లా వ్యాప్తంగా ఈనెల 10వ తేదీలోగా పాఠశాలలకు పరిపాలన అనుమతులు అందేలా చర్యలు :  మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమం విజయవంతానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ అధికారులందరినీ క్షేత్రస్థాయిలో పర్యటించేలా చర్యలు తీసుకొన్నామని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు వివరించారు. ఈ కార్యక్రమాన్ని  విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు గ్రామాభివృద్ధి కమిటీలు చక్కటి తోడ్పాటును అందిస్తున్నాయని ఈ సందర్భంగా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులకు వివరించారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 176 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని అందులో ఇప్పటి వరకు 68 పాఠశాలల్లో పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ పనులతో పాటు ప్రహరీ, విద్యుత్తు సౌకర్యం, మూత్రశాలలు, వంటగదుల వసతులు పూర్తయ్యాయని ప్రభుత్వం నిర్ణయించిన ఈనెల 10వ తేదీ వరకు జిల్లాలో మిగిలిన అన్ని పాఠశాలల్లో పనులను వేగవంతం చేసి పూర్తి చేసి పరిపాలన అనుమతికి అందిస్తామని కలెక్టర్ హరీశ్ ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో తెలిపారు.  మన ఊరు – మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు మరింత పటిష్టం అవుతాయని కలెక్టర్ వివరించారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్,  ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post