తెలంగాణా రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పరిశీలించారు. జూన్ 2 వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో సంబంధిత సీనియర్ అధికారులతో కలసి పబ్లిక్ గార్డెన్ లో ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్బంగా డీజీపీ మహేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, ప్రోటోకాల్ డైరెక్టర్ అర్విందర్ సింగ్ తదితరులున్నారు.
ఈ సందర్బంగా సీ.ఎస్. సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 వ తేదీన ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా అమర వీరుల స్తూపం వద్దకు చేరుకొని తెలంగాణ అమరులకు నివాళులు అర్పిస్తారని, అనంతరం పబ్లిక్ గార్డెన్ కు చేరుకొని జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని అన్నారు. పోలీసు దళాల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుందని తెలిపారు. అదేరోజు సాయంత్రం 30 మంది ప్రముఖ కవులచే కవిసమ్మేళనం రవీంద్ర భారతి లో నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని, సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి అవతరణ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.