రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్ 2వ తేదీ నుండి (21) రోజులపాటు ఘనంగా నిర్వహించాలి : సమావేశంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

పత్రికా ప్రకటన తేది:27.05.2023, వనపర్తి.

ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్ 2వ తేదీ నుండి (21) రోజులపాటు అందరి సమన్వయంతో ఘనంగా నిర్వహించి, విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
శనివారం ఐ.డి.ఓ.సి. సమావేశ మందిరంలో జూన్ 2 నుండి నిర్వహించనున్న తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో, పట్టణాలలో, రైతు వేదికలలో జాతీయ గీతాలాపనతో ప్రారంభించాలని ఆయన సూచించారు. రైతు వేదికలను మామిడి తోరణాలతో, పూలతో, విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించాలని ఆయన తెలిపారు. రైతు వేదికల ప్రాంగణాల్లో ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేయాలని అన్నారు.
వ్యవసాయ శాఖ కరపత్రాలు, బుక్ లెట్, పోస్టర్లు వంటి సామాగ్రిని తయారుచేసి, రైతులకు పంపిణీ చేసేలా చూడాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు.
గ్రామ పంచాయతీలు, నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ, మత్స్యకారుల వలలతో రైతులు, మత్స్యకారులు, మహిళలు ఊరేగింపుగా చెరువు కట్ట వద్దకు చేరుకొని ఉత్సవాలు నిర్వహించాలని ఆయన తెలిపారు. ఆయా నియోజక వర్గాలలో పింఛన్లు, కళ్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాల ఫలితాలపై ప్రజలకు వివరించాలని ఆయన తెలిపారు. వివిధ శాఖల పునర్ వ్యవస్థీకరణ, మెరుగైన సేవలపై, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అభివృద్ధిపై, దళిత బందు వంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు జరిగిన లబ్ది, గ్రామంలో చేపట్టిన మౌలిక వసతులపై వివరించాలని ఆయన అన్నారు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు, మెరుగైన విధానాలపై ప్రస్తావించాలన్నారు.
తెలంగాణ కవులు, కళాకారులతో కవి సమ్మేళనం నిర్వహించి, సాహిత్య అభిమానులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేసేలా చూడాలన్నారు. మహిళా సదస్సులు నిర్వహించాలని, వైద్య రంగంలో సాధించిన ప్రగతిపై కరపత్రాలు రూపొందించాలని ఆయన అన్నారు.
ప్రజా ప్రతినిధులు,విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలతో మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల సందర్శన నిర్వహించాలని, ఇంటింటికీ నల్లా నీరు సరఫరా అవుతున్న తీరును వివరించాలని ఆయన తెలిపారు.
గ్రామాలలో, పట్టణాలలో, ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యాలయాలలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించి, పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఆయన సూచించారు. పిల్లలకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మామిడి తోరణాలతో అందంగా అలంకరించాలని ఆయన ఆదేశించారు.
గ్రామ పంచాయతీలలో సమావేశాలు నిర్వహించి, అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, మౌనం పాటించాలని సూచించారు. సాంస్కృతిక, కళాకారుల ర్యాలీ నిర్వహించాలన్నారు.
వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణు గోపాల్, డి.ఆర్. డి. ఓ. నరసింహులు, డి.పి. ఓ. సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ విద్య శాఖ అధికారి జాకిర్ హుస్సేన్, మునిసిపల్ కమిషనర్ విక్రమ్ సింహ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
……
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post