రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయ పనుల పై సమీక్ష.

ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం 4.48 కోట్ల రూపాయల వ్యయంతో 1161 గజాల స్థలంలో చేపట్టనున్న మల్టీ లెవెల్ పార్కింగ్, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను ఈ నెల 31 వ తేదీన ఉదయం 10.00 గంటలకు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయ అధికారులతో ఆలయం వద్ద నూతనంగా చేపట్టనున్న మల్టీ లెవెల్ పార్కింగ్ భవన నిర్మాణ పనుల పై సమీక్షించారు. తమ వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు సరైన స్థలం లేక ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని భక్తుల సౌకర్యార్ధం 4.48 కోట్ల రూపాయల వ్యయంతో 1161 గజాల విస్తీర్ణంలో G+3 పద్దతిలో మల్టీ లెవెల్ పార్కింగ్ భవన నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. 40 ఫోర్ వీలర్స్, 200 టూ వీలర్ వాహనాలను పార్కింగ్ చేసే సామర్ధ్యంతో పాటు, మొదటి, రెండో అంతస్తులలో 24 షాప్స్, భక్తులకు వసతి కోసం 9 గదుల నిర్మాణం ఈ భవనం లో ఉండేలా డిజైన్ చేయడం జరిగిందని వివరించారు. ఇందులో 638 గజాల స్థలం దేవాలయం కు చెందినది కాగా, GHMC కి చెందిన 523 గజాల స్థలంను దేవాదాయ శాఖ కు బదిలీ చేయడం జరిగింది. దీంతో మొత్తం 1161 గజాల స్థలంలో ఈ కాంప్లెక్స్ ను నిర్మించడం జరుగుతుందని వివరించారు.  ఈ భవనం నిర్మాణ పనులు 6 నెలల్లో పూర్తి చేసే విధంగా ప్రణాలికలను సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి నిధులు 6 లక్షల రూపాయలతో భక్తుల సౌకర్యార్ధం ఏర్పాటు చేయనున్న బోర్ వెల్ పనులను కూడా అదేరోజు ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని రకాల సదుపాయాలు, వసతులను కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆలయం లోపల, బయట నూతన క్యూ లైన్ లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. భక్తులు అధికంగా వచ్చే ఆదివారం, మంగళవారం లలో ట్రాఫిక్ డైవర్షన్ చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ EO అన్నపూర్ణ, SE మల్లిఖార్జున్, స్థపతి వల్లి నాయగం తదితరులు పాల్గొన్నారు.

Share This Post