రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇరిగేషన్, మత్స్య శాఖల కు చెందిన ఉన్నతాధికారులతో సమావేశం.

రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్రం మంచినీటి చేపలను ప్రపంచానికి అందించే స్థాయికి అభివృద్ధి సాధించేలా సమగ్ర విధానాన్ని రూపొందించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో ఇరిగేషన్, మత్స్య శాఖల కు చెందిన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్ కుమార్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, జాయింట్ సెక్రెటరీ భీమ ప్రసాద్, నేషనల్ ఇంఫర్ మ్యాటిక్స్ (NIC) అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మత్స్య శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మత్స్య కమిషనర్ లచ్చిరాం భూక్యా వివరించారు.  ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని నీటి వనరులను సమర్ధవంతంగా వినియోగించుకోవడం వలన మత్స్య సంపదను మరింత ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి నీటి వనరులలో చేప పిల్లలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశించారని చెప్పారు. 2014-15 సంవత్సరంలో 381 నీటి వనరులలో 2.37 కోట్ల రూపాయల ఖర్చుతో 3.09 కోట్ల ఉచిత చేప పిల్లలను విడుదలతో ప్రారంభించగా, ఈ సంవత్సరం 28,704 చెరువులు, రిజర్వాయర్ లలో 93 కోట్ల చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు వివరించారు. చేపల పెంపకానికి అనువుగా ఉన్న 28 వేల చెరువులకు ఇప్పటికే జియోట్యాగింగ్ చేయడం జరిగిందని చెప్పారు. ఇంకా రాష్ట్రంలో చేపల పెంపకానికి అనువుగా ఉన్న నీటి వనరులను గుర్తించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలలో ఇరిగేషన్, రెవెన్యూ, మత్స్య శాఖ లకు చెందిన అధికారులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ప్రస్తుతం మత్స్య శాఖ పరిధిలో 15 కోట్ల చేప పిల్లల  ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన 23 చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. మిగిలిన చేప పిల్లలను ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. రిజర్వాయర్ ల వద్ద ఉన్న ఖాళీ స్థలాలను మత్స్య శాఖ కు కేటాయిస్తే వాటిలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు, చేపల మార్కెటింగ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు, శీతల గిడ్డంగులు వంటి కార్యకలాపాలు నిర్వహించేందుకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని తద్వారా రాష్ట్ర అవసరాలకు పూర్తిగా ఉత్పత్తి చేయవచ్చని చెప్పారు. చేప పిల్లల పెంపకానికి అనువైన నీటి వనరులను గుర్తించి తద్వారా రాబోయే కాలంలో చేప పిల్లల విడుదల కార్యక్రమానికి అవసరమైన పరిమాణాలను అంచనా వేయాలని అన్నారు. పలు రిజర్వాయర్ ల వద్ద మత్స్యకారులు పట్టిన చేపలను గ్రేడింగ్, ప్యాకింగ్, నిల్వ చేసుకునేందుకు, వలలు, పడవలు భద్రపర్చుకునేందుకు ల్యాండింగ్ కేంద్రాల నిర్మాణానికి స్థలాలను కేటాయించాలని ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్ కుమార్ ను మంత్రి కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  నూతన రిజర్వాయర్ ల నిర్మాణంతో రాష్ట్రంలో నీటి వనరులు విస్తారంగా పెరిగాయని చెప్పారు. ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల తో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంతో రాష్ట్రంలో ప్రస్తుతం 3.37 లక్షల టన్నులకు చేపల ఉత్పత్తి పెరిగిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న మంచినీటి చేపలను సహజ నీటి వనరులలో పెంచడం వలన జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ లలో ఎంతో డిమాండ్ ఉందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని నీటి వనరులను సద్వినియోగం చేసుకొని చేపల పెంపకం చేపట్టడం వలన ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం ఉంటుందని, అనేకమంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. నూతన టెక్నాలజీ వినియోగంపై మత్స్యకారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించే శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. కేజ్ కల్చర్ విధానంలో చేపల పెంపకం చేపడితే తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మత్స్య సంపద లభిస్తుందని అన్నారు. రాబోయే రోజులలో ఈ పద్దతిలో మరిన్ని జలవనరులలో కేజ్ లను ఏర్పాటు చేసి చేపల ఉత్పత్తి చేయడానికి అవసరమైన విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 5 వేల హెక్టార్ల లో 8.3 లక్షల కేజ్ లను ఏర్పాటు చేసి చేపల పెంపకం చేసే అవకాశం ఉందని, వీటి ద్వారా సుమారు 15 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతుందని అంచనా వేస్తున్నామని, వీటి విలువ సుమారుగా 15 వేల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అన్నారు. ప్రస్తుతం లోయర్ మానేర్ డ్యాం, పాలేరు, లంకసాగర్, వైరా, SRSP, నాగార్జున సాగర్, మూసీ, శ్రీపాద ఎల్లంపల్లి, సింగూరు, కడెం ప్రాజెక్టు లలలో 930 కేజ్ లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పాలేర్ రిజర్వాయర్ లో చేపట్టిన కేజ్ కల్చర్ పద్దతిలో చేపల పెంపకం పై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక అందజేయాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. రానున్న రోజులలో రాష్ట్రంలో పెరగనున్న మత్స్య సంపదను మార్కెటింగ్, ట్రాన్స్ పోర్ట్, ప్రాసెసింగ్ చేసేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించి నివేదికను అందజేయాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ కోరారు. రాష్ట్రంలో మంచినీటి రొయ్యల పెంపకాన్ని ఎన్నో అవకాశాలు ఉన్నాయని, అందుకు ఉపయోగపడే జలవనరులను గుర్తించి ప్రస్తుతం ఉన్న 10 కోట్ల నుండి మరింత ఎక్కువగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ఒక సమగ్రమైన పాలసీని తయారు చేయాలని, ఇందుకోసం ఇతర రాష్ట్రాలలో అమలు అవుతున్న పాలసీలను అధ్యయనం చేయడం ద్వారా రాష్ట్రాన్ని మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు దోహదపడుతుందని చెప్పారు. అంతేకాకుండా తమ పట్టా భూములలో చేపల చెరువులను నిర్మించుకొనేందుకు ముందుకొచ్చే రైతులకు సింగిల్ విండో విధానంలో తక్షణమే అనుమతులు ఇచ్చే విధానాన్ని రూపొందించాలని మంత్రి సూచించారు. కేజ్ కల్చర్, హేచరీల ఏర్పాటు, ప్రాసెసింగ్ ప్లాంట్ లు, దాణా ప్లాంట్ ల ఏర్పాటు వంటి విభాగాలలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేటు సంస్థలకు గల అవకాశాలను పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. చేపల పెంపకం రంగంలో ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారీ కాకుండా ప్రైవేట్ సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా నూతన విధివిధానాలు అవలంభిస్తూ ముందుకు వెళ్తున్నాయని, చక్కటి ఆదాయ వనరుగా రూపొంది లక్షలాది మందికి జీవనోపాధి కల్పించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా పెమ్పొండుతాయని తెలిపారు. రాష్ట్రాన్ని మంచినీటి చేపల ఉత్పత్తిలో అగ్రస్థానంలోకి తీసుకొచ్చి మత్స్యకారులకు మరింత మేలు జరిగే విధంగా చూడటం, ఉత్పత్తి, రవాణా లో నాణ్యతా ప్రమాణాలు పాటించే దిశగా ముందుకు వెళ్ళేలనేది ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు.

Share This Post