రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సహిస్తోంది మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సహిస్తోంది

మేడ్చల్ –  మల్కాజిగిరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఛైర్మన్​ శరత్ చంద్రారెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తోందని ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​  ప్రత్యేక దృష్టి సారించారని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా పరిషత్ ఛైర్మన్ మలిపెద్ది శరత్​ చంద్రారెడ్డి అన్నారు.

శుక్రవారం జిల్లా ప్రజా పరిషత్ పైఅంతస్తులో రూ. 26 లక్షలతో నిర్మించిన మినీ మీటింగ్ హాల్,  డైనింగ్ హాల్,  గదులను జడ్పీ ఛైర్మన్​తో పాటు ప్రజాప్రతినిధులు, కలెక్టర్​ తదితరులు రిబ్బన్​ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం జరిగిన జిల్లా పరిషత్​ సమావేశంలో జడ్పీ ఛైర్మన్​ శరత్​ చంద్రారెడ్డి,  జిల్లా కలెక్టర్ హరీష్​తో కలిసి జిల్లా పరిషత్​ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఛైర్మన్​ శరత్​ చంద్రారెడ్డి మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తుందని పేర్కొన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.  ప్రస్తుతం మేడ్చల్ –  మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా వరి పంట ఎక్కువగా సాగుతోందని రైతులు వరిపంటతో పాటు అధిక లాభాలను ఇచ్చే వాణిజ్య పంటలపై దృష్టి సారించాలని దీని కోసం ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ఈ విషయంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి  రేఖ మేరీ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కలెక్టర్​ ఈ సందర్భంగా ఆదేశించారు.  అలాగే ప్రభుత్వం నిర్మించిన రైతు వేదికల వద్ద రైతులను పిలిపించి సమావేశాలు నిర్వహించాలని ఆధునిక సాగు పద్ధతులు, వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులతో పాటు  వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన, చేపడుతున్న  ఆయా కార్యక్రమాలపై వారికి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని దీనికి స్పందించిన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఎంతో ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని ఇది ఎంతో మంచి పరిణామమని కలెక్టర్ హరీష్ ఆనందం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో జిల్లా విద్యా శాఖ అధికారులతో పాటు ఉపాధ్యాయులు మరింత కృషి చేసి విద్యార్థుల తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను మరింత ముందుకు కొనసాగించి ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన చేయాలని కలెక్టర్​ హరీశ్​ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎల్లప్పుడూ ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారం ఉంటుందని వివరించారు. మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి వల్ల గతంలో ఉన్న ఎన్నో సమస్యలు తొలగిపోయాయని ధరణిలో  మూడువేల సమస్యలు ఉండగా ఇప్పటి వరకు 2,700 సమస్యలను పరిష్కరించామని మరో 300 సమస్యలను సైతం  త్వరలో పరిష్కరిస్తామని కలెక్టర్ హరీశ్​ వివరించారు. ధరణికి సంబంధించిన ఆయా సమస్యలపై జిల్లాలోని ఆర్డీవోలు,  తహశీల్దార్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాలని కలెక్టర్​ సమావేశంలో పేర్కొన్నారు.  ధరణిలో ఏమాత్రం సమస్యలు తలెత్తినా వెంటనే సమస్యలను పరిష్కరించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ హరీష్ ఆదేశించారు.  జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ దాదాపు పూర్తయిందని అలాగే కొన్ని చోట్ల మొదటి విడత వ్యాక్సినేషన్ల ను కొందరు తీసుకోలేదని దీనికి సంబంధించి మొదటి,  రెండో విడత వ్యాక్సిన్లు వేయించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ అందించేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ హరీష్ వెల్లడించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా డీఆర్​డీఏ ద్వారా అందించే పెన్షన్లు అర్హులైన వారందరికీ అందజేస్తున్నామని ఈ విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  జిల్లా పరిషత్ సమావేశంలో ప్రజా ప్రతినిధులు  సంబంధిత సమస్యలను సభ దృష్టికి తీసుకురాగా వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఈ విషయంలో ప్రతి ఒక్కరికి సహకారం ఎంతో అవసరమని జడ్పీ ఛైర్మన్​ శరత్​ చంద్రారెడ్డి, కలెక్టర్​ హరీశ్​ తెలిపారు. జిల్లాలో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఈ విషయంలో సమస్యలపై తనకు వాట్సాప్ చేసినా, ఫోన్ ద్వారా సమాచారం అందించినా వెంటనే స్పందించి  సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ హరీష్ ప్రజాప్రతినిధులు అధికారులకు వివరించారు.  ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా జిల్లా పరిషత్ సీఈవో జిల్లాలోని సంబంధిత శాఖల అధికారులతో ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయాలని దీని వల్ల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారమవుతాయని కలెక్టర్ తెలిపారు.  ఈ సమావేశంలో జిల్లా వైస్​ ఛైర్మన్​ వెంకటేశ్​, జిల్లా అదనపు కలెక్టర్​ శ్యాంసన్​, జడ్పీ సీఈవో దేవసహాయం, జడ్పీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post