రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు రెండు పడకల ఇళ్ల నిర్మాణం పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి-రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు రెండు పడకల ఇళ్ల నిర్మాణం పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రత్యేక కార్యదర్శి సునీల్ శర్మతో కలిసి జిల్లాల కలెక్టర్లు, రోడ్లు భవనాల శాఖ అధికారులతో రెండు పడకల ఇళ్ల నిర్మాణం పై సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు రెండు పడకల ఇళ్ల నిర్మాణాలు చేపట్టి ఉచితముగా ఇచ్చేందుకు బృహత్తర కార్యక్రమం చేపట్టిందన్నారు. రాష్ట్రంలో 2.91 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు రూ.18 వేల కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. మున్సిపాలిటీలలో, గ్రామాలలో ఇప్పటికే 1.29 లక్షల ప్రారంభించిన ఇళ్ళు వివిధ దశలలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 62 వేల ఇళ్లు పూర్తి అయ్యాయని వాటికి మౌళిక సదుపాయాలు అయిన రోడ్డు, విద్యుత్, మంచినీరు, డ్రైనేజీ వంటి సౌకర్యాలు పూర్తి చేసి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ల పై ఉందన్నారు. 2023 జనవరి 15 వ తేదీ లోపల ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే పూర్తి చేయించి మౌళిక వసతులు కల్పించి లబ్ధిదారులను ఎంపిక చేసి అప్పగించే విధంగా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని దారిద్ర్య రేఖకు దిగువన ఉండి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి అద్దె భవనాల్లో నివసిస్తున్న వారు అర్హులని తెలిపారు. ముందుగా గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించాలని, వచ్చిన దరఖాస్తులను సంబంధిత తహశీల్దార్లకు పంపించాలని క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను కలెక్టర్లకు పంపించాలన్నారు. అనంతరం అట్టి జాబితాను కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి పంపిస్తే క్షుణ్ణంగా పరిశీలించి తుది జాబితా పంపించడం జరుగుతుందన్నారు. కట్టిన ఇళ్ల కంటే అర్హులైన లబ్ధిదారులు ఎక్కువ ఉంటే లక్కీ డీప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని మిగిలిన వారి జాబితాను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టాలన్నారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ ఆయా జిల్లాలలో లక్ష్యంగా పెట్టుకున్న రెండుపడకల ఇళ్ల నిర్మాణ పనుల్లో ఇప్పటికె టెండర్ పూర్తి అయి నిర్మాణ దశలో ఉన్న వాటిని జనవరి 15లోగా పూర్తి చేసేందుకు ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రాణాళిక ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. నిర్మాణం చివరి దశలో ఉన్నవాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మౌళిక సదుపాయాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు వారం వారం సమీక్ష నిర్వహించి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడంతోపాటు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని సూచించారు. శాసన సభ్యులతో మాట్లాడి సమన్వయంతో ప్రక్రియ పూర్తి అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పొడు భూములు, తెలంగాణా క్రేడా ప్రాంగణం, బృహత్ ప్రకృతి వనాలు, ధరణి, నేషనల్ హైవేల భూ సేకరణ అంశాల పై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 26వ తేదీలోగా పోడు భూముల సర్వే పూర్తి చేసి గ్రామ సభలు నిర్వహించి రెజల్యూషన్ సబ్ కమిటీకి పంపే విధంగా చర్యలు వేగవంతం చేయాలన్నారు. తెలంగాణా క్రీడా ప్రాంగణాలు, బృహత్ ప్రకృతి వనాలు ఇచ్చిన లక్ష్యాల మేరకు పూర్తి చేసి ఆన్ లైన్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ధరణిలో వచ్చిన ఫిర్యాదులను, జి.ఓ 58, 59 ప్రకారం ఉన్న సమస్యలను పరిశీలించి అర్హులైన వారికి పట్టాలు ఇవ్వాలను సూచించారు. పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, పెండింగ్ మ్యుటేషన్లు పూర్తి చేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో 4,225, పట్టణ ప్రాంతంలో 2,452 మొత్తం కలిపి 6,677 రెండు పడకల ఇళ్ల నిర్మాణానికి లక్ష్యంగా పెట్టుకోగా 2,741 ఇళ్లకు టెండర్ పూర్తి అయ్యిందని వాటిలో 2,341 ఇళ్ళు నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయని, మిగిలిన వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని, వాటిని సకాలంలో పూర్తి చేసేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసారు. తెలంగాణా క్రీడా ప్రాంగణాలు జిల్లాలో 867 లక్ష్యంగా పెట్టుకోగా 326 ఏర్పాటు పూర్తి అయ్యాయని, బృహత్ ప్రకృతి వనాలు 105 లక్ష్యంగా పెట్టుకోగా 44 పూర్తి అయ్యాయన్నారు. పోడు భూములకు సంబంధించి జిల్లాలోని 6 గ్రామ పంచాయతీల నుండి 1,086 దరఖాస్తులు వచ్చాయని వాటి సర్వే ఇప్పటికే పూర్తి చేసి గ్రామ సభలు సైతం పూర్తి చేయడం జరిగిందన్నారు. సబ్ కమిటీ, జిల్లా స్థాయి కమిటీలో పరిశీలించి గడువు లోపలే ప్రభుత్వానికి పంపిస్తామని తెలియజేసారు. జి.ఓ 58, 59 అనుసరించి జిల్లాలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఇళ్ల పట్టాలు, భూమీ పట్టాలు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ తిరుపతి రావు, రెవెన్యూ అధికారి హరిప్రియ, ఈఈపిఆర్ సురేష్, ఆర్ అండ్ బి ఈఈ శ్రవణ ప్రకాష్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రామేశ్వరి దేవి, పి.డి.డి.ఆర్.డి.ఓ ప్రభాకర్, డిపిఓ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓలు వెంకటాచారి, చంద్రకళ, రాజేశ్వరి, వేణుగోపాల్, సూరజ్, వివిధ శాఖల జిల్లా తదితరులు పాల్గొన్నారు.

Share This Post