ప్రభుత్వ బడులకు మహర్దశ
నాగర్ కర్నూలు జిల్లాలో మన ఊరు.. మన బడి’కి మొదటి విడతలో 35% పాఠశాలలు ఎంపిక
సర్కారు స్కూళ్లలో 12 రకాల మౌలిక వసతులకు ప్రభుత్వం ప్రాధాన్యత
జిల్లాలో ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
ఇంజనీరింగ్ శాఖలకు 290 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు నిధుల అంచనా నివేదికలు సమర్పించే లా జిల్లా కలెక్టర్ ఆదేశాలు
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో ఊరి బడి దశ మారనున్నది
విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.
పోటీప్రపంచంలో నిలబడేలా విద్యార్థులను పాఠశాల స్థాయిలోనే తీర్చిదిద్దాలని నిర్ణయించింది.
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమ బోధనను ప్రవేశపెట్టడంతోపాటు సదుపాయాలను మెరుగుపర్చేందుకు ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఒకప్పుడు అరకొర వసతులతో ప్రభుత్వ పాఠశాలలు కునారిల్లగా.. తెలంగాణ రాష్ట్రంలో సర్కారుబడులకు ప్రాధాన్యత పెరిగింది.
‘మన ఊరు.. మన బడి’ అమలుతో నాగర్ కర్నూలు జిల్లాలో 556 ప్రాథమిక పాఠశాలలు, 128 ప్రాథమికోన్నత పాఠశాలలు, 131 ఉన్నత పాఠశాలలు మొత్తం 825 ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలు ఉండగా మొదటి విడత మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా 200 ప్రాథమిక పాఠశాలలు, 45 ప్రాథమికోన్నత పాఠశాలలు,45 ఉన్నత పాఠశాలలు జిల్లా వ్యాప్తంగా 20 మండలాల పరిధిలో మొత్తం 35 శాతం 290 ప్రభుత్వ పాఠశాలలను మొదటి విడత మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా ఎంపిక చేశారు.
ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి.
పాఠశాలలకు అనుగుణంగా అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 4 ప్రకారం పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ఎంత ఎస్టిమేషన్ కు ఎ స్థాయి ఇంజనీరింగ్ అధికారి సాంకేతిక అనుమతి మంజూరు చేయవచ్చు అనేది నిర్దేశించడం జరిగింది.
30 లక్షల వరకు డిప్యూటీ ఇంజనీర్, 30 లక్షల నుండి 50 లక్షల వరకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 50 లక్షల నుండి 2 కోట్ల వరకు సూపర్డెంట్ ఇంజనీర్, 2 కోట్లుకు పైబడి చీఫ్ ఇంజనీర్లు అనుమతులకు నిర్దేశిస్తారు.
ఇంజనీరింగ్ అధికారులు పాఠశాలను సందర్శించి విద్యా కమిటీ చైర్మన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులతో చర్చించి వసతుల కల్పనకు అంచనా వ్యయాన్ని నిర్దేశిస్తారు.
పాఠశాల స్థాయికి అనుగుణంగా ఒక్కో పాఠశాలకు 30 లక్షల రూపాయల నుండి 2 కోట్ల రూపాయలకు పైగా పాఠశాలలకు ఖర్చు చేయనున్నారు.
ఎంపిక చేసిన పాఠశాలల్లో 12 రకాల మౌలిక వసతుల కల్పన
మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన పాఠశాలలకు నీటి వసతితో కూడిన మరుగుదొడ్లు, విద్యుత్, తాగు నీటి సౌకర్యం, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కావల్సిన ఫర్నిచర్, పెయింటింగ్, మరమ్మతులు, గ్రీన్ చాక్ బోర్డ్స్, ప్రహరీ గోడ, కిచెన్ షెడ్, అదనపు తరగతి గదుల నిర్మాణం, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాల్, డిజిటల్ విద్య కై అవసరమైన మౌళిక సదుపాయాలు వంటి 12 రకాల పనులను మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా చేసుకునే సదవకాశం వచ్చింది.
నిధుల సమీకరణ ఇలా
సర్వ శిక్ష అభియాన్, జిల్లా పరిషత్, జాతీయ ఉపాధి హామీ, అసెంబ్లీ డెవలప్మెంట్ ఫండ్స్, మండల పరిషత్, నాబార్డు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్, గ్రామపంచాయతీల నిధులను వినియోగించనున్నారు.
నిధులు ఖర్చు చేయు అధికారం
పాఠశాలకు అవసరమైన మౌళిక వసతుల కల్పనకు ఇంజనీరింగ్ అధికారుల అంచనా వ్యయంతో ఒక్కో పాఠశాలకు 30 లక్షల నుండి 200 కోట్ల వరకు వర్క్ ఆర్డర్ మంజూరు చేసే అధికారం జిల్లా కలెక్టర్ కు ఉంటుంది.
పాఠశాల స్థాయిలో
పాఠశాల విద్యా కమిటీ చైర్మన్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఇంజనీర్ మరియు గ్రామ సర్పంచుల అధీనంలో నిధులు విడుదల కానున్నాయి.
మా పాఠశాలకు వచ్చే విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా ఎంపిక చేయడంతో విద్యార్థినిలకు మెరుగైన వసతులతో పాటు అన్ని సదుపాయాలు కల్పించడంతో డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్ సుందరీకరణ తో మా పాఠశాలకు విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందని విశ్వసిస్తున్నాం.
నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లతా
మా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నాగర్ కర్నూల్ నందు 1021 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
మాకున్న ముఖ్యమైన సమస్య గదుల కొరత, కిచెన్ షెడ్డు డైనింగ్ హాల్ మన ఊరు మనబడి ద్వారా తీరన్నాయి.
మా పాఠశాలలను ఎంపిక చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్, డీఈఓ లకు మా పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.
ప్రధానోపాధ్యాయుడు డి కురుమయ్య
జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నాగర్ కర్నూల్
నాగర్ కర్నూలు జిల్లాలో మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా జిల్లాలో 290 పాఠశాలలను జిల్లా కలెక్టర్ ఆమోదంతో ఎంపిక చేయడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో 200 ప్రాథమిక పాఠశాలలు 45 ప్రాథమికోన్నత పాఠశాలలు 45 ఉన్నత పాఠశాలల్లో మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా 290 జిల్లా కలెక్టర్ ఆమోదం ఎంపిక చేయడం జరిగింది.
ప్రభుత్వ పాఠశాలల విద్యా వ్యవస్థ బలోపేతానికి మన ఊరు మన బడి కార్యక్రమం దోహదపడుతుంది.
రానున్న రోజుల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతాయి.