రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గురువారం నేలకొండపల్లి మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంఖుస్థాపనలు చేశారు.

ప్రచురణార్థం

ఖమ్మం, సెప్టెంబర్ 22:

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గురువారం నేలకొండపల్లి మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంఖుస్థాపనలు చేశారు. మంత్రి మండలంలోని ముజ్జుగూడెం గ్రామంలో రూ. 1.5 కోట్లతో నూతనంగా నిర్మించిన 33/11 కెవి సబ్ స్టేషన్ కు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం పీఎంజిఎస్వై క్రింద సుమారు రూ. 1303.50 లక్షల అంచనా వ్యయంతో మంజూరైన రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కట్టు కాచారం నుండి తక్కెళ్లపాడు వరకు నిర్మించనున్న బిటి రహదారి పనులకు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నిరంతర, నాణ్యమైన కరంట్ ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. తెలంగాణ రాక పూర్వం 7800 మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉండేదని, ఇప్పుడు 17000 మెగావాట్ల స్థాపిత విద్యుత్ కు చేరామని ఆయన తెలిపారు. ఒకప్పుడు రైతులు కరెంట్ కొరకు అర్థరాత్రి పొలాల వద్దకు వెళ్లి పాముకాటు తదితర ప్రమాదానికి గురయ్యేవారని, ఇప్పుడు 24 గంటలు నాణ్యమైన ఉచిత కరంట్ ఇస్తున్నామని అన్నారు. పమ్మి లో 132 కెవి సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం విద్యుత్ వ్యవస్థ మొత్తం మెరుగవుతుందన్నారు. పంపిణీ వ్యవస్థను ప్రయివేటీకరణకు కేంద్రం చూస్తుందని ఆయన అన్నారు. విద్యుత్ సంస్థల ప్రయివేటుతో చాలా సమస్యలు వస్తాయని ఆయన తెలిపారు. విద్యుత్, సాగునీరు పుష్కలంగా ఉండడంతో పాలేరు క్రింద రెండు పంటలు పండుటున్నట్లు ఆయన అన్నారు. గత ప్రభుత్వాలు రూ. 200 లు పెన్షన్ ఇవ్వగా, ఈ ప్రభుత్వం రూ. 2,016, వికలాంగులకు రూ. 3,016 ల చొప్పున ఆసరా పెన్షన్లు తెలంగాణలో 46 లక్షల మందికి అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతుభీమా వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. దేశంలో మరెక్కడా లేని పథకాలు రాష్ట్రంలో అమలుచేస్తున్నామన్నారు. కరంట్ చక్కగా చేసుకున్నాం, రహదారులను చక్కగా చేసుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రతి ఇంటికి ప్రభుత్వం పథకాల లబ్ది అందుతుందని, పధకం అందని ఇల్లు లేదని మంత్రి అన్నారు.
కార్యక్రమాల్లో పాల్గొన్న ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, రైతులు, పల్లె ప్రజలు, పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత నిచ్చి పథకాలు అమలు చేస్తుందని అన్నారు. దళితబంధు, రైతు బంధు, రైతు భీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి ఎన్నో పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. రాష్ట్ర నిధులు, ప్రాజెక్టులు, హక్కులకై కేంద్రంతో పోరాటం చేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, జెడ్పి వైస్ చైర్మన్ ధనలక్ష్మి, విద్యుత్ ఎస్ఇ ఏ. సురేందర్, పీఆర్ ఇఇ శ్రీనివాస్ రావు, డిపివో హరిప్రసాద్, విద్యుత్ డిఇ లు ఎం. రామారావు, విసి. బాబూరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post