రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయకుమార్ తెల్లవారుజామున నగరంలోని పలు డివిజన్లలో సైకిళ్ళపై పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.

 ప్రచురణార్ధం

ఆగష్టు 03, ఖమ్మ

నగర ప్రజల ఆకాంక్షల మేరకు మరింత మెరుగైన మౌళిక వసతులను అందించే దిశగా నగరంలో అభివృద్ధి పనులను చేపట్టామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయకుమార్ తెలిపారు. నగర మేయర్ పునుకోలు నీరజ, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీసు కమిషనర్ విష్ణు యస్. వారియర్, నగరపాలక సంస్థ కమీషనర్ అనురాగ్ జయంతితో కలిసి మంగళవారం తెల్లవారుజామున నగరంలోని పలు డివిజన్లలో సైకిళ్ళపై పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు ప్రజల సమస్యలను. మంత్రి తెలుసుకున్నారు. చర్చి కాంపౌండ్ జంక్షన్ అభివృద్ధి పనులు, ప్రకాష్ నగర్ డ్రైనేజీ, ఖమ్మం వ్యవసాయమార్కెట్ రోడ్డు, సుందరయ్య నగర్ పార్కు నిర్వహణ, గోళ్ళపాడు ఛానల్ పైప్ లైన్ పూర్తయిన ప్రదేశాలలో ఫెన్సింగ్ పనులు, గాంధీచౌక్ రోడ్డు పనులు, పాతబస్టాండ్, ఆర్ డి ఓ ఆఫీస్ వైరారోడ్ తదితర ప్రాంతాలలో మంగళవారం సైకిళ్ళపై మంత్రి పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. చర్చి కాంపౌండ్ జంక్షన్, గోళ్ళపాడు ఆధునీకరణ ముగింపు పనులను త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను మంత్రి  ఆదేశించారు.  అదేవిధంగా నగరంలో ఒకటవ, రెండవ, త్రిటౌన్ తో పాటు ఖానాపురం హవేలి ప్రాంతాలలో మోడల్ రోడ్లను గుర్తించి. ఫుట్ పాత్ ప్రాజెక్టు పనులను చేపట్టాలని మంత్రి నగరపాలక, రోడ్లు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా నగరంలోని అభివృద్ధి పనుల పరిశీలన, ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు సైకిళ్ళపై పర్యటన చేపట్టామని ప్రతి 3 నెలలకు ఒక్కసారి ఈ విధంగా పర్యటించి ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. నగరంలో సమీకృత వెజ్-నాన్వెజ్ మార్కెట్ ఏర్పాటు, గోళ్ళపాడు ఛానల్ ఆధునీకరణ, రోడ్ల విస్తరణ పనులను ఇప్పటికే చేపట్టామని, దానితో పాటు ఫుట్ పాత్ ప్రాజెక్టు పనులు చేపట్టి నగర ప్రజలకు మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి తెలిపారు. నగర ప్రజలు కూడా సహకరించాలని, అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అవసరమని మంత్రి తెలిపారు. గ్రీన్ ఖమ్మంలో భాగంగా ఇప్పటికే నగరంలో విస్తృతంగా ఎవెన్యూ ప్లాంటేషన్ చేపట్టామని, గ్రీన్ బడ్జెట్లో మొక్కల సంరక్షణ పనులు చేపట్టాలని నగరపాలక సంస్థ అధికారులను మంత్రి ఆదేశించారు. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణలో, భాగంగా సీ.సీ టి.వి కెమెరాలను ఏర్పాటు చేసి భద్రత చర్యలను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు నేరాలను తగ్గించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని పోలీసు కమీషనర్ కు మంత్రి సూచించారు.

అనంతరం లకారం ట్యాంక్ బండ్ నందు జిల్లా కలెక్టర్, నగర మేయర్, పోలీసు కమీషనర్ తో కలిసి మంత్రి మొక్కలు నాటారు

సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, అడిషనల్ డి.సి.పి. (లా అండ్ ఆర్డర్) సుభాష్ చంద్రబోస్, నగరపాలక సంస్థ అసెస్టెంట్ కమీషనర్ మల్లీశ్వరీ, రోడ్లు, భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు శ్యాంప్రసాద్, విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీరు రమేష్, జిల్లా అటవీ శాఖాధికారి ప్రవీణ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన, నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీ చేయనైనది.
[

Share This Post