రీడర్ గా ఉన్నవారే లీడర్ అవుతారని, బుక్స్ చదువుతూ ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.

ప్రచురణార్థం

ఖమ్మం, ఆగస్టు 18:

రీడర్ గా ఉన్నవారే లీడర్ అవుతారని, బుక్స్ చదువుతూ ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం రాజా రామ్మోహన్ రాయ్ 250వ జయంతిని పురస్కరించుకుని విద్యార్థినులచే ఏర్పాటుచేసిన ర్యాలీని జిల్లా గ్రంధాలయం వద్ద కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత పునరుజ్జీవన పితామహుడైన రాజా రామ్మోహన్ రాయ్ జయంతిని జరుపుకుంటున్నామన్నారు. ఆ కాలంలోనే మహిళా సాధికారత పై, మహిళలు, పురుషులు సమానమని గళమెత్తిన మహనీయుడు రాజా రామ్మోహన్ రాయ్ అని ఆయన తెలిపారు. రామ్మోహన్ రాయ్ సుప్రసిద్ధ భారతీయ సంఘ సంస్కర్త అని, అస్పృశ్యత, కులజాడ్యం, సతీ సహగమనం పై ఆయన చైతన్యం కల్గించారన్నారు. ఆధునిక విద్యా వ్యాప్తి, స్త్రీ జనోద్ధరణ కోసం రామ్మోహన్ రాయ్ విశేషంగా కృషి చేశారన్నారు. ప్రపంచమంతా మహిళలను వంటింటికే పరిమితం చేసి, చిన్న చూపు చూసే రోజుల్లో ఈ దురాలోచన రూపుమాపాలనే నినాదం చేశారన్నారు. చదువుతోనే ఉన్నత స్థానం సిద్ధిస్తుందని ఆయన అనేవారని కలెక్టర్ తెలిపారు. ఐడియా కు ఎంతో శక్తి ఉందని, ఇది ఐడియా వచ్చినప్పుడే తెలుస్తుందని ఆయన తెలిపారు. గ్రంధాలయం నుండి పుస్తకాలు విద్యార్థులకు అందజేయాలని, పుస్తక పఠనం పై ప్రోత్సహించాలని ఆయన అన్నారు. పుస్తక పఠనం చేస్తుండాలని, ఉన్నత లక్ష్యం ఏర్పరచుకొని సాధనకు ఇష్టంగా కష్టపడి ఎదగాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉమామహేశ్వరరావు, కార్యదర్శి అర్జున్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post