రుణాలు నిరుపేదల ఆర్థిక ప్రగతిని పెంచే విధంగా ఉండాలి…

జనగామ జనవరి 21.

బ్యాంకులు మంజూరు చేసే రుణాలు నిరుపేదల ఆర్థిక ప్రగతిని పెంచే విధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అన్నారు.

శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో లీడ్ బ్యాంకు అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డి సి సి& డి ఎల్ ఆర్ సి గత వార్షిక రుణ ప్రణాళిక అమలు తీరుతెన్నులను సంబంధిత జిల్లా అధికారులు బ్యాంకు అధికారులతో సమీక్షించారు.

వార్షిక రుణ ప్రణాళిక ను బ్యాంక్ అధికారులు వివరిస్తూ 2021- 22 వార్షిక రుణ ప్రణాళిక లో పంట రుణాలు 882 కోట్లను లక్ష్యంగా పెట్టుకొని 420 కోట్లు సాధించామని 47 శాతంగా ఉందన్నారు. అదేవిధంగా వ్యవసాయ రుణాలు సాధింపు లో 612 కోట్ల రుణాల మంజూరు కు గాను 212 కోట్లు రుణాలు అందించి 32 శాతం తో, సూక్ష్మ స్థాయి రుణాలలో 295 కోట్లకు గాను 49 కోట్లు మంజూరు చేసి 16 శాతంతో, విద్యా రుణాల లో 20 కోట్లకు గాను 1.50 కోట్ల రుణాలను మంజూరు చేసి కేవలం ఏడు శాతం తో, హౌసింగ్ రుణాలలో 59 కోట్లకు గాను 18 కోట్లు మంజూరు చేసి 31 శాతం తోను మొత్తంగా 2717 కోట్లకు గాను 705 కోట్లు మంజూరు చేసి 26 శాతంతో ఉన్నామన్నారు.

2021 -22 సంవత్సరంలో స్వయం సహాయక సంఘాలకు 284 కోట్ల రుణాలు కేటాయించగా 182 కోట్లు మంజూరు చేసి 64 శాతంతో ఉన్నామని, మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలకు 8.72 కోట్లకు గాను 6.30 కోట్లు మంజూరు చేసి 72. 31 శాతంతో ఉన్నామని బ్యాంక్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్కు వివరించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ ఉద్యాన వన రంగాలకు రుణాలను అధిక మొత్తంలో ఇవ్వాలన్నారు. వ్యవసాయానికి తోడుగా జిల్లాలో పాడి పరిశ్రమ కూడా అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందన్నారు. డైరీ యూనిట్ నెలకొల్పు కునేందుకు సహకరించాలన్నారు.
అలాగే జిల్లాలో 14 వందల ఎకరాలను పామాయిల్ తోటల సాగుకు ఎంపిక చేయడం జరిగిందని రైతులు అధిక ఆదాయమే కాకుండా నికర ఆదాయాన్ని ఇచ్చే పామాయిల్ తోటల పెంపకానికి బ్యాంక్ అధికారులు అధిక మొత్తంలో రుణాలు పంపిణీ చేస్తూ రైతాంగాన్ని ప్రోత్సహించాలన్నారు.

అనంతరం 2022-23 సంవత్సరానికి గాను 2720 కోట్ల తో రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ నాబార్డ్ ఎజిఎం చంద్రశేఖర్ లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస రావు ఎస్ బి ఐ రూరల్ ఏజీఎం అలీముద్దీన్, వరంగల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంజీఎం హరి రామ్ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ రామ్ రెడ్డి ఐ డి బి ఐ డి జి ఎం అజయ్ కుమార్ శేషాద్రి మెప్మా పిడి హర్షవర్ధన్ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ రాజేష్ మత్స్యశాఖ అధికారి పూర్ణచందర్ డి పి ఎం సమ్మక్క తదితరులు పాల్గొన్నారు

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం జనగామ వారిచే జారీ చేయడమైనది

Share This Post