రుణాల మంజూరులో బ్యాంకులు లక్ష్యాలను సాధించాలి – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

సెప్టెంబర్ 07, 2021ఆదిలాబాదు:-

            పంటల సాగుకు, ఉపాధి కల్పనకు బ్యాంకులు రుణాలు అందించి ఆర్థికస్థితిగతులు పెంపొందించే దిశగా సహకరించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో జూన్ 2021 మాసాంతానికి అంతమయ్యే జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు పంట రుణాలు, నిరుద్యోగ యువతకు వివిధ రంగాలలో ఉపాధి కల్పనకు బ్యాంకులు రుణాలు అందించాలని కోరారు. కోవిడ్ నేపథ్యంలో ఆశించిన ప్రగతి సాధించాక పోయినప్పటికీ గత జూన్ మాసం నుండి రైతులకు పంట రుణాలు అందించడం జరుగుతున్నదని, ఈ ఆర్థిక సంవత్సరం 198.86 కోట్ల పంట రుణాలు లక్ష్యం కాగా, ఆగష్టు మాసాంతం వరకు 56 వేల 976 మంది రైతులకు 81.36 కోట్ల రూపాయలు పంట రుణాలు అందించడంతో పాటు, 2736 మంది కొత్త ఖాతాదారులకు 32 కోట్ల రూపాయలు పంట రుణాలు అందించడం జరిగిందని తెలిపారు. బ్యాంకు లింకేజి కార్యక్రమం కింద సెప్టెంబర్ మాసాంతం వరకు 3823 మహిళా సంఘాలకు 90 కోట్ల రుణాలు మంజూరు చేయడం లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 1788 సంఘాలకు సుమారు 58 కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. వచ్చే సమావేశం నాటికీ మహిళా సంఘాలు రుణాలు చెల్లించే విధంగా గ్రామీణాభివృద్ధి, ఐకేపీ సిబ్బంది చర్యలు చేపట్టాలని అన్నారు. సంక్షేమ శాఖల ద్వారా లబ్దిదారులకు మంజూరైన సబ్సిడీ ల మేరకు యూనిట్ లను త్వరలో గ్రౌండింగ్ చేయాలనీ బ్యాంకర్లకు సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ కార్యక్రమాల లక్ష్యాలను అధిగమించేందుకు బ్యాంకర్ల సహకారంతో సాధించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, లీడ్ బ్యాంకు మేనేజర్ చంద్రశేఖర్, మున్సిపల్ కమీషనర్ శైలజ, సంక్షేమ శాఖల అధికారులు, వివిధ బ్యాంకుల మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post