రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒకే కాంప్లెక్స్ లో భరోసా, సఖీ, ఓల్డ్ ఏజ్ హోమ్ ల నిర్మాణం – త్వరలోనే అందుబాటులోకి తెస్తాo – రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు సిద్దిపేట 17 , మార్చి 2022:

సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒకే కాంప్లెక్స్ లో భరోసా, సఖీ, ఓల్డ్ ఏజ్ హోమ్ ల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించి త్వరలోనే అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు.

గురువారం సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ అవరణలో రూ.48.69 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సఖి వన్ స్టాప్ సెంటర్ భవనం, సికింద్రాబాద్ కు చెందిన గౌరా పెట్రో కేమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు కోటి రూపాయలతో నూతనంగా నిర్మించనున్న మహిళలు, బాలల భరోసా సెంటర్ భవనం కు రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు శంకుస్ధాపన చేశారు.

ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ….
ప్రస్తుతం భరోసా కేంద్రం, సఖి కేంద్రాలు సిద్దిపేట పట్టణంలో వేర్వేరు చోట ఉండడం వల్ల బాధితులకు సేవలు అందించడం , సమన్వయం చేసుకోవడం లో కొంత మేర సమస్యలు ఏర్పడుతున్నాయని , అధికారుల పర్యవేక్షణ కొరవడుతుందని మంత్రి తెలిపారు.

భరోసా , సఖి కేంద్రాలతో పాటు కొత్తగా కోటి రూపాయలతో మంజూరు చేసుకున్న ఓల్డ్ ఏజ్ హోమ్ ను సైతం సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలోని ఒకే కాంప్లెక్స్ పరిధిలో నిర్మించడంతో బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలు కలుగుతుందన్నారు.
తమ సమస్యలను ఎవరికి చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోయే మహిళలకు, బాలలకు భరోసా కేంద్రం ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి తెలిపారు.
మహిళలు, బాలల సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు న్యాయ సహాయం భరోసా కేంద్రం ద్వారా అందుతుందన్నారు. బాధితులకు కౌన్సిలింగ్ అందించి తమ కాళ్ళ మీద తాము నిలబడేలా సఖి, భరోసా కేంద్రాలు సహాయాన్ని అందిస్తాయని మంత్రి తెలిపారు.
మహిళలు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలకు సఖి కేంద్రం వన్ స్టాప్ సెంటర్ గా ఉంటుందన్నారు .
ఓకే కాంప్లెక్స్ లో వీటి నిర్మాణం చేపట్టడం వల్ల ఉమ్మడి వసతులను కల్పించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఈ కేంద్రాలు ఉండడం వల్ల బాధితులకు రక్షణతో పాటు సపోర్టు అందుతుందన్నారు. వీటి నిర్మాణ పనులను వెంటనే చేపట్టి సాధ్యమైనంత త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి స్పష్టం చేశారు.

కార్యక్రమంలో సిపి శ్రీమతి ఎన్ శ్వేత, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ శ్రీమతి మంజుల రాజనర్సు, జిల్లా సంక్షేమ అధికారి శ్రీ రామ్ గోపాల్ రెడ్డి, గౌరా పెట్రో కేమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు ప్రసాద్, శ్రీనివాస్ లు
స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

——————————
డీ.పీ.ఆర్.ఓ, సిద్ధిపేట కార్యాలయంచే జారీ చేయనైనది.

Share This Post