రెండవ రోజు ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు – కలెక్టర్ హరీష్

పదవ తరగతి వార్షిక పరీక్షలు రెండవ రోజైన మంగళవారం నాడు జరిగిన ద్వితీయ భాష పరీక్షకు 98 . 91 శాతం విద్యార్థులు హాజరయ్యారని జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ తెలిపారు. 11,394 రెగ్యులర్ విద్యార్థులకు గాను 11,270 మంది హాజరయ్యారని, మిగతా 124 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని అన్నారు. మంగళవారం నాడు అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి కౌడిపల్లీలోని జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా? లేదా? సి. సి. కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా అని పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్ లను అనుమతించరాదని, విద్యార్థులు, ఇన్విజిలేటర్లు కోవిడ్ నిబందనలను పాటిస్తూ మాస్క్ ను తప్పకుండా ధరించాలని సూచించారు. ఎక్కడ కూడా కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, కాపీయింగ్ కు పాల్పడితే మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ చేయాలని నిర్వాహకులను కలెక్టర్ ఆదేశించారు. నిర్వాహకులు పరీక్షలు ముగిసేంత వరకు కూడా ఎంతో అప్రమత్తతతో ఉంటూ ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని అన్నారు. ప్రశ్న పత్రాలను తప్పనిసరిగా తగిన పోలీసు బందోబస్తు మధ్య కేంద్రాలకు తరలించాలని, ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా పూర్తి పారదర్శకంగా, పక్కాగా పరీక్షలు నిర్వహించాలని అన్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున పరీక్షా కేంద్రంలో త్రాగు నీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్సా కేంద్రాన్ని పరిశీలించి మందులు, శానిటైజేర్, ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆరోగ్య కార్యకర్తకు సూచించారు. విద్యార్థులు పరీక్షా సమయాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో పదవ తరగతి పరీక్షలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరుగుచున్నాయని, ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేవని అన్నారు. ఈ రోజు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, అధికారులు మెదక్, రామాయంపేట, హవేళిఘంజాపూర్, చిన్న శంకరంపేట్, చేగుంట, నార్సింగి, తూప్రాన్, మనోహరాబాద్ లలో 25 పరీక్షా కేంద్రాలను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారని కలెక్టర్ హరీష్ తెలిపారు.

Share This Post