రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం పై పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాసాబ్ ట్యాంక్ లోని మత్స్య శాఖ కార్యాలయం నుండి అన్ని జిల్లాల జిల్లా పశువైద్యాదికారులు, వెటర్నరీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో అర్హులైన లబ్దిదారులు అందరు 10 రోజులలో తమ వాటాదనం DD లు చెల్లించే విధంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్ లోని మత్స్య శాఖ కార్యాలయం నుండి అన్ని జిల్లాల జిల్లా పశువైద్యాదికారులు, వెటర్నరీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో షీఫ్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ  అధర్ సిన్హా, డైరెక్టర్ రాంచందర్, TSLDA CEO మంజువాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమంతో అద్భుతమైన ఫలితాలు వచ్చాయని, ఇది అందరి కృషితోనే సాధ్యమైందని అభినందించారు. గొర్రెల ఉత్పత్తిలో దేశంలోనే ప్రధమస్థానంలో నిలిచామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పశుసంవర్ధక శాఖ కు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, సబ్సిడీ పై గొర్రెలు, పాడి గేదెల పంపిణీ, జీవాలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తుండటం వలన ఎంతో ప్రాధాన్యత కలిగిన శాఖ గా పశుసంవర్ధక శాఖ కు గుర్తింపు లభించిందని వివరించారు. దేశంలోనే తెలంగాణ పశుసంవర్ధక శాఖ కు మంచి పేరు లభించిందని పేర్కొన్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున జీవాలు వ్యాధుల భారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, జీవాల సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అదేవిధంగా అన్ని పశువైద్య శాలల్లో జీవాలకు అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. ఒకవేళ మందులు ఏమైనా కొరత ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. మందుల కొరత ఉన్నట్లు పిర్యాదులు వస్తే చర్యలు తప్పవని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఇతర ప్రకృతి వైపరిత్యాలతో మరణించిన జీవాల సమాచారాన్ని బాధితుల నుండి సేకరించి ఆయా జిల్లా కలెక్టర్ లు, పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులకు నివేదికను అందజేసి విపత్తుల నివారణ సంస్థ ద్వారా ప్రభుత్వం అందజేసే ఆర్దిక సహాయాన్ని త్వరితగతిన అందేలా కృషి చేయాలని ఆదేశించారు. సబ్సిడీ పై పంపిణీ చేసిన గొర్రెలకు ప్రభుత్వం ఇన్సురెన్స్ సౌకర్యం కల్పించిందని, చనిపోయిన గొర్రెలకు వెంట వెంటనే క్లైయిమ్ క్రింద గొర్రెను కొనుగోలు చేసి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇన్సురెన్స్ సమస్య పై పలు ప్రాంతాల నుండి పిర్యాదులు వస్తున్నాయని, పెండింగ్ లో ఉన్న ఇన్సురెన్స్ క్లెయిమ్ ను వారం రోజులలోగా పరిష్కరించాలని చెప్పారు. వర్షాకాలంలో పశువులు, గొర్రెలు, మేకలు గుండెవాపు, జబ్బవాపు, చిటుకు, నీలి నాలుక వంటి రోగాల భారిన పడకుండా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం కొన్ని జిల్లాలలో మాత్రమే 90 శాతం వరకు పూర్తయిందని, మిగిలిన జిల్లాలలో కూడా వారం రోజులలో వ్యాక్సినేషన్ నూరుశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ శాఖల కు చెందిన ఖాళీ స్థలాలలో పశుగ్రాసం పెంపకం, క్యాటిల్ హాస్టళ్ళ ఏర్పాటు, వ్యాక్సినేషన్ కార్యక్రమాలు వంటివి చేపట్టాలని మంత్రి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. పలు ప్రాంతాలలో నూతన పశువైద్య శాలల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని, దీనికి సంబంధించి ప్రతిపాదనలను అందజేయాలని ఆదేశించారు. అదేవిధంగా శిధిలావస్థకు చేరుకున్న పశువైద్య శాలల అభివృద్ధి కు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మొదటి విడతలో 554 పశువైద్యశాల భవనాలలో ప్రహారీగోడ ల నిర్మాణం, విద్యుత్, త్రాగునీరు వంటి సౌకర్యాలతో పాటు భవనాల మరమ్మతు వంటి పనులు చేపట్టినట్లు వివరించారు. రెండోవిడత లో 536 పశువైద్యశాలల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. నూతనంగా ఏర్పడిన మండలాలలో కూడా పశువైద్యశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, అవసరమైన ప్రతిపాదనలను అందజేయాలని ఆయా జిల్లాల అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లాల వారిగా ఖాళీగా ఉన్న హస్పిటల్ సిబ్బంది, VAS, VA ల సమాచారం వెంటనే పంపించాలని మంత్రి ఆదేశించారు. గొర్రెలు, మేకలు క్రయ విక్రయాలు జరుపుకొనేందుకు గాను అన్ని జిల్లాలలో అన్ని వసతులతో కూడిన మార్కెట్ లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు అవసరమైన 5 ఎకరాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ ల సహకారంతో సేకరించాలని ఆదేశించారు. ఇప్పటికే కామారెడ్డి, వనపర్తి, ఖమ్మం, కరీంనగర్ తదితర జిల్లాలలో మార్కెట్ ల నిర్మాణం కోసం స్థల సేకరణ, నిధులను మంజూరు చేయడం కూడా జరిగిందని చెప్పారు. కామారెడ్డి లో నిర్మాణ పనులు కూడా ప్రారంభం అయ్యాయని వివరించారు. మార్కెట్ ల నిర్మాణం కోసం అవసరమైన నిధులు వెంటనే మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, మిగిలిన జిల్లాలలో కూడా వీలైనంత త్వరగా స్థల సేకరణ పూర్తిచేయాలని చెప్పారు. ప్రభుత్వం పాడి రైతులకు అన్ని విధాలుగా చేయూతను అందిస్తున్నప్పటికీ విజయ డెయిరీకి పాల సేకరణ పెరగడం లేదని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. లీటర్ పాలకు 4 రూపాయల నగదు ప్రోత్సాహకం, సబ్సిడీ పై పాడి గేదెల పంపిణీ, సబ్సిడీపై పశు దాణా, మందుల పంపిణీ వంటివి అందిస్తున్నందున వీటిని పాడి రైతులకు వివరించి విజయ డెయిరీకి పాలు పోసే విధంగా అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించాలని పశుసంవర్ధక శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు పూర్తిస్థాయిలో అమలు జరిగేందుకు అధికారులు వారంలో మూడు రోజులపాటు క్షేత్రస్థాయిలో పర్యటించాలని అన్నారు. దీంతో క్రిందిస్తాయి అధికారులు, సిబ్బంది పనితీరు మరింత మెరుగవుతుందని, రైతుల సమస్యల ను కూడా తెలుసుకొనే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో గోపాలమిత్రల సేవలను వినియోగించుకోవాలని అన్నారు. పశుసంవర్ధక, TSLDA, డెయిరీ అధికారులు ఉమ్మడి ప్రణాళికతో పనిచేయడం ద్వారా మరెన్నో అద్బుతమైన ఫలితాలను సాధించవచ్చని, కార్యాచరణను రూపొందించుకోవాలని చెప్పారు. కృత్రిమ గర్భధారణ లో కూడా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా టెస్ట్ ట్యూబ్ బేబి తరహాలో(IVF) రెండు మగ, ఒక ఆడ దూడలను ఉత్పత్తి చేయడం ఒక గొప్ప విజయంగా మంత్రి అభివర్ణించారు. కోరుట్ల లోని వెటర్నరీ కళాశాల ఆధ్వర్యంలో IVF విధానం లో ఆరోగ్యవంతమైన, అధిక పాల ఉత్పత్తి ని సాధించే లక్ష్యంతో చేపట్టడం జరిగిందని వివరించారు. ఈ విధానంతో కలిగే ప్రయోజనాల గురించి రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేలా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు.

Share This Post