*రైతును రాజుగా చూడాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం : నాఫ్స్కాబ్ చైర్మెన్ కొండూరు రవీందర్ రావు*

*రైతును రాజుగా చూడాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం : నాఫ్స్కాబ్ చైర్మెన్ కొండూరు రవీందర్ రావు*

*ప్రచురణార్థం-1*
రాజన్న సిరిసిల్ల, జనవరి 11: రైతును రాజుగా చూడాలన్నదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని నాఫ్స్కాబ్ చైర్మెన్ కొండూరు రవీందర్ రావు పేర్కొన్నారు.

సిరిసిల్ల పట్టణంలోని చంద్రంపేటలో గల జిల్లా రైతువేదికలో నిర్వహించిన రైతుబంధు సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అత్యంత పారదర్శకంగా అమలు చేస్తుందని అన్నారు. రైతుల శ్రేయస్సు కోరి పంట పెట్టుబడి సహాయం కింద ఇప్పటివరకు 8 విడతల్లో రైతుబంధు పథకం ద్వారా 50 వేల 600 కోట్ల రూపాయలను జమ చేయడం జరిగిందని తెలిపారు. మన జిల్లాలో 1 లక్షా 25 వేల మంది రైతుల ఖాతాల్లో 945 కోట్ల రూపాయలను జమ చేయడం జరిగిందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతుల అభ్యున్నతికి ఇలాంటి విప్లవాత్మకమైన, సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేదని అన్నారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకు రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసి లాభాలను పొందాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశానుసారం ఈ రైతుబంధు సంబరాలను కోవిడ్ నిబంధనలకు లోబడి నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.

జిల్లా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల శ్రేయస్సు కోరి, దూరదృష్టితో ఆలోచించి రైతుబంధు పథకం అమలు చేశారని అన్నారు. రైతు బంధు కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి రైతులు ఎనలేని సంతోషంగా ఉన్నారన్నారు. 63 లక్షల మంది తెలంగాణ రైతులకు రైతుబంధు అందిస్తున్న కార్యక్రమం దేశంలో మరెక్కడా లేదన్నారు. ప్రభుత్వ సూచనలు పాటించి రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసి అధిక లాభాలను పొందాలన్నారు.

రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని అన్నారు. రైతులు వాస్తవాలను గ్రహించాలని, ప్రత్యామ్నాయ పంటల సాగుతో అధిక లాభాలను పొందవచ్చనే విషయాలను గమనించాలని తెలిపారు. ఒకప్పుడు మెట్ట ప్రాంతమైన మన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇప్పుడు పంటల సాగుతో కళకళలాడుతుందని గుర్తు చేశారు. మన జిల్లాలో 2 లక్షల 86 వేల ఎకరాలు సాగుకు యోగ్యంగా ఉందని అన్నారు. 50 వేల కోట్ల రూపాయలు రైతు బంధు పథకం ద్వారా ఇప్పటివరకు పంపిణీ చేయడం జరిగిందని, అందుకే రైతు బంధు సంబరాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అకునూరి శంకరయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా, ఇంచార్జి డీఆర్ఓ శ్రీనివాస రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రణధీర్ రెడ్డి, సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ సింగిరెడ్డి రవీందర్ రెడ్డి, తదితరులు, రైతులు పాల్గొన్నారు.

Share This Post