మిర్యాలగూడ, నవంబర్ 8.రైతులకు ఇబ్బంది లేకుండా వరి ధాన్యం కొనుగోలుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.సోమవారం జిల్లా కలెక్టర్ మిర్యాలగూడ లో రైతు వేదిక కార్యాలయంలో సన్న ధాన్యం రైతులకు టోకెన్ జారీ ప్రక్రియ పరిశీలించి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మిర్యాలగూడ,వేముల పల్లి,మాడుగుల పల్లి,హాలియా,నిదమనూర్,దామరచర్ల మండలం లోని రైతులు ట్రాక్టర్ ల ద్వారా సన్న ధాన్యం ప్రైవేట్ గా మిల్లులకు తీసుకు వస్తారని,సన్న ధాన్యం 60 శాతం కోతలు పూర్తి అయినట్లు, మిల్లుల వద్ద 3 కి.మీ ల క్యూ లు,3 రోజుల పైన వేచి ఉండడం లేకుండా గత సంవత్సరం మాదిరి గానే రైతులకు ఎక్కువ సమయం వేచి ఉండకుండా,మిల్లర్ లకు ఇబ్బంది లేకుండా రద్దీ నియంత్రించి క్రమ పద్ధతి లో కొనుగోళ్ళకు టోకెన్లు జారీ చేస్తున్నట్లు తెలిపారు.రైతు సంఘాల,రైతులు కూడా సహకరిస్తున్నారని,వ్యవసాయ శాఖ, రెవెన్యూ,పోలీస్ శాఖ ల అధికారులు కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.టోకెన్ లకు ఎటువంటి కొరత లేదని,ప్రతి రైతుకు టోకెన్ లు జారీ చేస్తామని,రైతులు తొందర పడవద్దని,5 ఎకరాలు కంటే ఎక్కువ ఉన్న రైతుకు 2 టోకెన్ లు,10 ఎకరాలు ఉంటే 3 టోకెన్ లు జారీ చేస్తామని తెలిపారు. అలాగే దొడ్డు రకం వరి ధాన్యం ఐ. కె.పి.,పి.ఏ.సి.ఎస్ వరి కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలుకు 180 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కు గాను ఇప్పటికే 120 కొనుగోలు కేంద్రాలు కొనుగోళ్లు ప్రారంభించి నట్లు కలెక్టర్ వెల్లడించారు. నకిరేకల్,నల్గొండ లో కొనుగోళ్లు మొదలైనట్లు,మునుగోడు,దేవరకొండ లో కూడా2,3 రోజుల్లో ధాన్యం వచ్చే అవకాశం ఉందని,కొనుగోలు కేంద్రాల ద్వారా వానాకాలం సీజన్ లో రైతు పండించిన ప్రతి ధాన్యం గింజ కొనే వరకు డిసెంబర్,జనవరి వరకు కొనుగోలు కేంద్రాలు కొనుగోళ్లు చేయనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.అన్ని కొనుగోలు కేంద్రాలలో తేమ యంత్రాలు,టార్పాలిన్ లు ఏర్పాటు చేసినట్లు,రైతులు ధాన్యం కోత తర్వాత రెండు,మూడు రోజులు ఆర బెట్టి తాలు,మట్టి పెళ్లలు లేకుండ 17 శాతం తేమ లేకుండా నాణ్యతా ప్రమాణం తో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తీసుకు రావాలని కలెక్టర్ రైతులకు విజ్ఞప్తి చేశారు.జిల్లా కలెక్టర్ వెంట ఆర్.డి.ఓ.రోహిత్ సింగ్,వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.


