రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేయాలి:: జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి

జనగామ, నవంబర్ 09:
రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్ళు పూర్తి చేయాలని జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అన్నారు.మంగళవారం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్వ సభ్య సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ, జిల్లాలో కొనసాగుతున్న వరి ధాన్యO కోనుగోలులో రైతులకు మిల్లర్ల నుండి రవాణాలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే యాసంగిలో వరికి బదులుగా లాభాలు వచ్చే, ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులకు అవగాహన కోసం సమావేశాలు నిర్వహించాలన్నారు. ఎండకాలంలోగా మిషన్ భగీరథ పైపు లైన్ పూర్తి చేసి ప్రజలకి త్రాగునీరు అందించాలని, అధికారులు లేని చోట నియామకాలు చేపట్టాలని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య మాట్లాడుతూ, జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులకు ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. జిల్లాలోని రైతులకు రైతు భీమా వర్తింపజేశామన్నారు.
రైతు వేదికలలో ప్రత్యామ్నాయ పంటల సాగు గురించి అవగాహన కల్పించాలని, అందుకు సంబంధించిన కరపత్రాల ద్వారా ప్రచారం చేయాలని ఆయన అన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సౌకర్యాలు కల్పించాలన్నారు. ధాన్యం రవాణాకు లారీలను అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లాలో వైద్య శాఖ, నీటి పారుదల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, ఉద్యాన వన శాఖ, పౌర సరఫరాల శాఖ, పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ, సంబంధిత శాఖల ప్రగతిని సమావేశంలో సమీక్షించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు.
మొదటి సారిగా జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశానికి వచ్చిన కలెక్టర్ ను జెడ్పి చైర్మెన్, సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హామీద్, జెడ్పి సిఇఓ ఎల్. విజయలక్ష్మి, అధికారులు, జెడ్పిటిసిలు, ఎంపిపిలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post