రైతులు అన్ని రకాల పంటలను పండించాలని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయమే కాకుండా భూసారం కూడా పెరుగుతుందని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి అన్నారు.

బుధవారం నాడు మోటకొండూర్ మండలం సికిందర్ నగర్ గ్రామంలో బాలస్వామి అనే  రైతు సాగు చేస్తున్న పంటలను ఆమె పరిశీలించారు.
ఒక ఎకరం భూమిలో కొత్తిమీర, మెంతికూర, పాలకూర, పప్పు శనగలు, వంకాయ, టమాట, బెండ, బీర, కాకరకాయలు పండించడం పట్ల జిల్లా కలెక్టర్ రైతును అభినందించారు. పంటల సాగు వివరాలు అడిగి తెలుసుకున్నారు.  ఇలాంటి రైతులను ఇతర రైతులకు ఆదర్శంగా చూపి తక్కువ నీరు, ఎరువులు, మందులతో  సాగు అయ్యే ఇలాంటి పంటల పట్ల ప్రోత్సాహించాలని,  వరి పంట తోనే కాకుండా ఇతర పంటలతో కూడా అధిక లాభాలను గడించవచ్చు అనేది రైతులకు స్పష్టమైన అవగాహన కలిగే విధంగా వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాలలో చిన్న చిన్న రైతు సమావేశాల ఏర్పాటు ద్వారా  సాగు వివరాలపై సలహాలు, సూచనలు అందించాలని తెలిపారు.
అనంతరం ఆత్మకూరు మండలం రాయపల్లి గ్రామంలో రైతులతో జరిగిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ, రాబోయే యాసంగి వరి ధాన్యం ఎఫ్.సి.ఐ. కొనుగోలు చేయనన్నందున రైతులు  పంటల మార్పిడి విధానం ద్వారా ఆరుతడి పంటలతో తమ ఆదాయాన్ని పెంచుకోవాలని రైతులకు సూచించారు. వేరుశనగ, శనగ, ఆవాలు, నువులు, కుసుమలు, ఆముదం, పెసర, పొద్దు తిరుగుడు,  మినుములు, జొన్న, తదితర ఆరుతడి పంటలు సాగు చేయాలని, తొంభై  నుండి 120 రోజుల లోపల  చేతికి వస్తాయని,  వరి పంట కంటే ఎక్కువ ఆదాయం వస్తుందని అన్నారు. నీరు, క్రిమిసంహారక మందుల అవసరం తక్కువని, పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గుతాయని,  ఆరుతడి పంటలతో భూసారం పెరుగుతుందని, స్వతహాగా ఎరువుల వాడకం తగ్గుతుందని అన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాలలో ప్రతిరోజూ మూడు నాలుగు చిన్న చిన్న రైతు సమూహాల  ఏర్పాటుతో  ప్రతి రైతుకు ఆరుతడి పంటలపై  సూచనలు, సలహాలు అందించాలని, మండల వ్యవసాయ అధికారులు ప్రతిరోజూ రెండు మూడు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కార్యక్రమాలలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు పద్మావతి,  మండల వ్యవసాయ అధికారి సుజాత, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

రైతులు అన్ని రకాల పంటలను పండించాలని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయమే కాకుండా భూసారం కూడా పెరుగుతుందని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి అన్నారు.

Share This Post