రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని తేమశాతం ఆధారంగా కొనుగోలు చేసి వెనువెంటనే మిల్లుకు తరలించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

నవంబరు 29, ఖమ్మం:

రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని తేమశాతం ఆధారంగా కొనుగోలు చేసి వెనువెంటనే మిల్లుకు తరలించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం పోలీసు కమీషనర్ విష్ణు. యస్.వారియర్ తో  కలసి ముదిగొండ, నేలకొండపల్లి మండలాలలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. ముదిగొండ మండలం గోకినేపల్లి, నేలకొండపల్లి మండలం పైనంపల్లి కొనుగోలు కేంద్రాలను కలెక్టర్, పోలీసు కమీషనర్ సందర్శించి కొనుగోలు ప్రక్రియను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ధాన్యం కొనుగోలుకు గాను జిల్లాలో ఇప్పటికే 245 కేంద్రాలను ఏర్పాటు చేసామని అవసరమైన యెడల అదనపు కేంద్రాలను ప్రారంభిస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అంచనాకు గాను సొసైటీలు, ఐ.కె.పి. మార్కెటింగ్ శాఖల ద్వారా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసామన్నారు. జిల్లాలో ఇంకా వరికోతలు జరుగుతున్నాయని, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తేమశాతం అధికంగా ఉంటుందని, తూర్పారబట్టిన ధాన్యాన్ని రైతులు కేంద్రాలకు తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. పైనంపల్లి సొసైటీ కొనుగోలు కేంద్రం నుండి ఇప్పటివరకు 2 వేల క్వింటాళ్ళు 32 మంది రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, ఈ సారి 24 గంటలలోనే రైతుల ఖాతాలకు నగదు జమ అవుతుందని కలెక్టర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో ఇప్పటికే రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని, ట్యాబ్, డేటా ఎంట్రీ వెనువెంటనే చేసి 24 గంటలలోపు రైతులకు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయా కొనుగోలు కేంద్రాలలో నిల్వగల ధాన్యం తేమశాతాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. పోలీసు కమీషనర్ విష్ణు.యస్.వారియర్ మాట్లాడుతూ మన జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు ఇతర రాష్ట్రాల నుండి ఎవరైనా ధాన్యం తెచ్చిన యెడల స్థానిక పోలీసులకు వెంటనే సమాచారం ఇవాలని వారివల్ల మన రైతాంగం నష్టపోకూడదని, మధ్య దళారీ వ్యవస్థను నమ్మవద్దని రైతులకు సూచించారు. జిల్లా సరిహద్దు ప్రాంతాలలో ఇప్పటికే బార్డర్ చెకోపోస్టులను ఏర్పాటు చేసి నిఘాను మరింత పెంచామని పోలీసు కమీషనర్ తెలిపారు. అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, జిల్లా పౌర సరఫరా అధికారి రాజేందర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యా వందన జిల్లా సహాకార శాఖాధికారి విజయకుమారి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి విజయనిర్మల, సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్ సోములు, పైనంపల్లి సొసైటీ అధ్యక్షులు నాగుబండి శ్రీనివాసరావు, ముదిగొండ. నేలకొండపల్లి తహశీల్దార్లు, ఎం.పి.డి.ఓ.లు, సర్పంచ్లు, మండల స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post