జనగామ, సెప్టెంబర్ 30: రైతులు నష్టపోకుండా పత్తి కొనుగోళ్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు, జిన్నింగ్ మిల్లర్లతో కలెక్టర్ 2021-22 వానాకాలం పత్తి కొనుగోళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో వరి తర్వాత పత్తి పండించే విస్తీర్ణం ఉన్నట్లు, కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా కొనుగోళ్ళు చేయాలన్నారు. వానాకాలం లో లక్షా 43 వేల 589 ఎకరాల్లో పత్తిని పండించినట్లు, సుమారు లక్షా 14 వేల 499 మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా ఉన్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 13, హన్మకొండ జిల్లాకు చెందిన 2, ఈ సంవత్సరం క్రొత్తగా నిర్మించబడ్డ 2 జిన్నింగ్ మిల్లులు సీసీఐ తో ఒప్పందం చేసుకున్న తర్వాత నోటిఫై చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. వానాకాలం కొనుగోళ్ళు నోటిఫై అయిన జిన్నింగ్ మిల్లుల ద్వారా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 8 నాబార్డు గోడౌన్లు 40 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగివున్నట్లు, 17 వ్యవసాయ మార్కెట్ కమిటీ గోడౌన్లు 19 వేల 800 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కల్గి ఉన్నట్లు ఆయన అన్నారు. ఈ మార్కెటింగ్ సీజన్ కి మార్కెటింగ్ శాఖ ద్వారా 30 వేల టోకెన్లు అందుబాటులో ఉంచామన్నారు. ఈ వానాకాలం లాంగ్ స్టాపుల్ లెంగ్త్ పత్తికి క్వింటాలుకు రూ. 6 వేల 25, మీడియం స్టాపుల్ లెంగ్త్ పత్తికి 5 వేల 726 కనీస మద్దతు ధర నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. రైతులకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా కనీస మద్దతు ధర పొందేందుకు, నాణ్యమైన పత్తిని కొనుగోలు కేంద్రానికి తెచ్చే విధంగా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. నాణ్యమైన ప్రత్తి పంట పండించే రైతులకు మంచి లాభాలు ఉంటాయన్నారు. తూకం యంత్రాలను అన్నిచోట్లా ముందస్తుగా తనిఖీలు చేసి, తూనికలు కొలతల శాఖ అధికారులు ధ్రువీకరణ ఇవ్వాలన్నారు. కొనుగోలు సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వ్యవసాయ అధికారి ప్రతి కొనుగోలును పర్యవేక్షణ చేయాలన్నారు. కాటన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేయాలని ఆయన అన్నారు. ఒకేచోట సీసీఐ, ప్రయివేటుగా కొనుగోళ్ళు జరుగనున్నందున ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయాలని, రికార్డులను పకడ్బందీగా చేపట్టాలని ఆయన తెలిపారు. కనీస మద్దతు ధరకు తక్కువకు కొనుగోలు చేసిన ప్రతి క్వింటా, నాణ్యతా, పరిమాణం చూడాలని, దీనిని విడిగా భద్రపరచాలని ఆయన అన్నారు. కొనుగోలు కేంద్రాల వివరాలు, అమ్మకానికి కావాల్సిన ఆధార్ తదితర పత్రాల విషయమై గ్రామాల్లో టాం టాం ద్వారా విస్తృత ప్రచారం చేయాలన్నారు. పత్తి పంట వేసిన ప్రతి రైతు, కౌలుదారుడైనా సరే వారి పేరు, పంట వివరాలు వ్యవసాయ శాఖ వెబ్సైట్ లో నమోదు చేయాలన్నారు. కేంద్రం వద్ద కనీస మద్దతు ధర, తేమ శాతంలతో సీసీఐ ద్వారా బ్యానర్ ఏర్పాటు చేయాలన్నారు. లైసెన్స్ లేని వ్యాపారస్తులకు తమ పంటను అమ్మి మోసపోవద్దని కలెక్టర్ రైతులను కోరారు. లైసెన్స్ లేని వ్యాపారస్తులు పత్తి కొనుగులు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. జిన్నింగ్ మిల్లుల వద్ద అగ్నిమాపక శాఖ ద్వారా అగ్నిమాపక తనిఖీలు చేయాలన్నారు. మిల్లులకు 24 గంటలు నిరాటంక విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు సమన్వయంతో కొనుగోళ్ళు సజావుగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు, జిల్లా మార్కెటింగ్ అధికారి కె. నాగేశ్వర శర్మ, జిల్లా వ్యవసాయ అధికారిణి టి. రాధిక, తూనికలు, కొలతల అధికారి ఎస్. విజయ్ కుమార్, సీసీఐ సివోలు కె. తిరుమల రావు, యు.ఎన్. వాంఖేడే, జనగామ, కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ కార్యదర్శులు జి. జీవన్ కుమార్, ఎస్. నిరంజన్, జిన్నింగ్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.