రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సి.సి.ఐ. నిబంధనల మేరకు రైతులు పత్తిని నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌తో కలిసి పత్తి కొనుగోలుపై జిల్లా వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖలు, ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 1 లక్షా 60 వేల ఎకరాలలో పత్తి సాగు చేయడం జరిగిందని, ఎకరానికి 6-7 క్వింటాళ్ళ చొప్పున దాదాపు 11 లక్షల క్వింటాళ్ళ పత్తి దిగుబడి వస్తుందని, 2021-22 సంవత్సరానికి గాను ప్రభుత్వం ఒక క్వింటాల్‌కు 6 వేల 25 రూపాయల మద్దతు ధర నిర్ణయించడం జరిగిందని తెలిపారు. గత సంవత్సరం జిల్లాలోని మూడు వ్యవసాయ మార్కెట్ల పరిధిలో 4 లక్షల 80 వేల 978 క్వింటాళ్ళు కొనుగోలు చేసి 7 జిన్నింగ్‌ మిల్లులకు అందించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులు పత్తి నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, మద్దతు ధరతో పాటు అదనపు ప్రోత్సాహం పొందాలని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్ధతు ధర రైతులకు లాభదాయకంగా ఉన్నందున రైతులు దళారులను నమ్మి మోసపోకుండా లైసెన్స్‌ కలిగిన వారి వద్ద పత్తి విక్రయించడంతో పాటు విక్రయానికి సంబంధిత రశీదులు, మద్ధతు ధర, తూకంలలో నష్టపోకుండా సంబంధిత అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. పత్తి తేమ శాతం 8 నుండి 12 శాతం
లోపు ఉండేలా రైతులు చూడాలని, తేమ శాతం 6 నుండి 7 శాతం ఉన్నట్లయితే ఆ ప్రకారముగా ప్రోత్సాహకాలు పొందవచ్చని తెలిపారు. ఈసారి పత్తి కొనుగోలు కోసం సంబంధిత కొనుగోలు కేంద్రాలలో అవసరమైన తూకం యంత్రాలు, తేమ శాతం కొలిచే పరికరాలతో సిద్దంగా ఉండాలని, కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతుల కోసం త్రాగునీరు, నీడ, మౌళిక సౌకర్యాలు కల్పించాలని, ప్రతి ఒక్కరు కొవిడ్‌-19 నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు వచ్చే సమయంలో తప్పనిసరిగా ఆధార్‌కార్డు, బ్యాంక్‌ ఖాతా పుస్తకం వెంట తీసుకురావాలని సూచించారు. జిన్నింగ్‌ మిల్లులలో అగ్ని ప్రమాదాలు జరుగకుండా సంబంధిత అగ్నిమాపక అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. అనంతరం మద్ధతు ధర, ప్రోత్సాహకాలు, నాణ్యతా ప్రమాణాలు, ఇతర వివరాలతో కూడిన గోడప్రతులను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వినోద్‌కుమార్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి గజానంద్‌, జిన్నింగ్‌
మిల్లుల యజమానులు, అగ్నిమాపక శాఖ అధికారి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post