రైతులు పంటల సాగు విషయంలో వ్యవసాయ అధికారులు కీలక పాత్ర వహించాలి, వానాకాలం పంటల సన్నాహక సమావేశంలో జిల్లా కలెక్టర్ హరీశ్

 

పత్రిక ప్రకటన

తేదీ : 26–05–2022

రైతులు పంటల సాగు విషయంలో వ్యవసాయ అధికారులు కీలక పాత్ర  వహించాలి,

వానాకాలం పంటల సన్నాహక సమావేశంలో జిల్లా కలెక్టర్ హరీశ్

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రైతులు పంట సాగు చేసే విషయంలో ఆయా మండలాల వ్యవసాయాధికారులు (ఏవో)లు, వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో)లు కీలకపాత్ర వహించాలని జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు.

గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వానాకాలం –2022 సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో మండల వ్యవసాయాధికారులతో పాటు మండల వ్యవసాయ విస్తరణాధికారులు భూపరీక్షలు చేపట్టి రైతులకు ఆ భూమిలో ఎలాంటి పంట వేస్తే దిగుబడి ఎక్కువగా వస్తుందనే వివరాలను తెలియజేయాలన్నారు. రైతులకు సంబంధించి ఆయా మండలాల వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో) ఎంతో కీలకపాత్ర వహించాలన్నారు. దీనికి గాను రైతుల వద్దకు వెళ్ళడంతో పాటు క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించాలని రైతుల సందేహాలను నివృత్తి చేయాలని కలెక్టర్ హరీశ్ తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడే సమస్యలు తెలుస్తాయని దీనిని దృష్టిలో ఉంచుకొని తమ విధులు సక్రమంగా నిర్వహించి రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. అలాగే రైతులకు సంబంధించిన డాక్యుమెంటేషన్ పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని వారికి ప్రభుత్వం నుంచి అందే అన్ని సదుపాయాలు, సౌకర్యాలు అందేలా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ అధికారులపై ఉందన్నారు. గ్రామాల్లో ప్రభుత్వం కట్టించిన రైతువేదికల వద్ద సమావేశాలు ఏర్పాటు చేయాలని అక్కడ రైతులకు అవసరమైన సమాచారాన్ని తెలియజేయాలని కలెక్టర్ హరీశ్ పేర్కొన్నారు. రైతులు ఉద్యానవన పంటలు (హార్టికల్చర్)పై దృష్టి పెట్టేలా చర్యలు చేపట్టాలని అన్నారు. మండల వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు. మండలాల వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు, జిల్లా అధికారులు రైతులకు ఆర్థికంగా ఎక్కువ ఆదాయాన్నిచ్చే ప్రత్యామ్నాయ పంటలను సాగుకు రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ వివరించారు. పంట మార్పిడి చేస్తే కలిగే లాభాలను రైతులకు తెలియజేస్తూ అధిక ఆదాయాన్నిచ్చే పంటల గురించి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్ళి అవగాహన కల్పించేందుకు ఆయా గ్రామాల వారీగా ఎంపిక చేసుకోవాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి మేరీరేఖ, వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్లు, ఆయా మండలాల వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post