రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించేలా అవగాహన కల్పించాలి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీష్

రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించేలా అవగాహన కల్పించాలి

మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్​ హరీష్​

మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రైతులు వరి పంటకు బదులుగా వేరే పంటలు సాగు చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్​ హరీష్​ అన్నారు. సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులకు తెలియజేసేందుకు జిల్లాలోని వ్యవసాయ శాఖ, ఉద్యానవనశాఖ, విత్తనాల డీలర్లతో పాటు అధికారులతో కలెక్టర్​ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ హరీష్​ మాట్లాడుతూ. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్​సీఐ) రానున్న యాసంగి సీజన్​లో వడ్లు,  ముడి బియ్యంతో పాటు ఉప్పుడు బియ్యం   ( పారా బాయిల్డ్ )  బియ్యం  కొనుగోలు చేయలేమని చెప్పిన నేపథ్యంలో రానున్న యాసంగి సీజన్​లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని కలెక్టర్ హరీష్  కోరారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అన్నదాతలు ఆర్థికంగా పరిపుష్టి సాధించేలా వరి పంటకు బదులుగా వేరుశనగ, కంది, పెసర, మినుముతో పాటు కూరగాయల పంటలు సాగు చేసేలా వ్యవసాయ శాఖతో పాటు ఉద్యానవనశాఖ అధికారులు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల్లో మార్పుతో పాటు చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్​ వివరించారు. రైతులు యాసంగి సీజన్ లో వరి సాగుకు బదులుగా  ప్రత్యమ్నాయంగా శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, మినుములు, పెసర, తదితర పంటలు పండించేలా, భూముల లక్షణాలకు అనుగుణంగా పంటలు పండించేలా రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని అన్నారు. ప్రత్యమ్నాయ పంటలు పండించేందుకు అందుబాటులో ఉన్న విత్తనాల గురించి రైతులకు తెలియజేయాలని అన్నారు.  గ్రామాలలో మొత్తం రైతులు ఎంత మంది ఉన్నారు, ప్రతి సంవత్సరం ఎన్ని ఎకరాల భూమిని సాగు చేస్తున్నారు,  ముందు ఎ పంటను పండించారు, ఇప్పుడు ఏ పంటలు  పండిస్తున్నారని మొత్తం వివరాలతో జాబితా తయారు చేయాలనీ అన్నారు. కూరగాయలు, పందిరి సాగు పంటలు పండించేలా చూడాలని దీనికి ప్రభుత్వం రాయితీ అందచేస్తుందనే వివరాలను ప్రతి రైతుకు తెలియజేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రేపటి నుండి ప్రారంభించి అక్టోబర్ 29 వరకు 4 రోజులలో అన్ని గ్రామాలలో రైతు వేదిక సమావేశాలు పూర్తి చేయాలనీ అన్నారు. గ్రామం లో ఉన్న రైతులందరు రైతు వేదిక సమావేశాలలో పాల్గొనేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. రైతులను ఆర్థికంగా ఉన్నతస్థాయికి తీసుకెళ్ళేందుకు కొత్తకొత్త పద్దతుల్లో సాగు చేసే వివరాలను సైతం వారికి అవగాహన కల్పించినట్లయితే రైతురాజు అనేది తప్పకుండా నిజమవుతుందని కలెక్టర్​ ​  తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్​ నర్సింహారెడ్డి, ఆర్ డి ఓ ,రవి ,మల్లయ్య  ,జిల్లా వ్యవసాయాధికారిణి మేరీ రేఖ, డీహెచ్ఎస్​వో సత్తార్​, ఏడీ వెంకట్రామి రెడ్డి, వ్యవసాయ శాఖ, ఉద్యానవనశాఖ అధికారులతో పాటు ఆయా విత్తనాల డీలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post