రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు.

మంగళవారం నాడు ఐనవోలు మండలం లోని పున్నెలు,ఐనవోలు, కొండపర్తీ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు రైస్ మిల్లు యజమానులతో ఒప్పందం చేసుకొని వరి పంటను సాగు చేసుకోవాలని సూచించారు. యాసంగి లో దాన్యం కొనుగోలు ఉండబోవని స్పష్టం చేశారు. రైతులు ఆరుతడి పంటలు గా పొద్దుతిరుగుడు, శనగ, వేరుశెనగ, గోధుమ, పెసర మినుము వంటి పంటలు వేసుకోవాలని సూచించారు. వ్యవసాయ భూములలో రైతులు ప్రతిసారి ఒకే రకం పంటలు పండించవద్దని పంటల మార్పిడి విధానాన్ని అవలంబించాలని కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. భవిష్యత్తులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహిస్తుందని, రైతులు దీనిని గమనించి ప్రత్యామ్నాయ సాగు కు సహకరించాలని కలెక్టర్ కోరారు.
రైతులు తమ సొంత భరోసాతో మాత్రమే వరి సాగు చేసుకోవాలని కలెక్టర్ స్ప‌ష్టం చేశారు.యాసంగి లో ఎఫ్ సి ఐ ద్వారా వడ్లు కొనుగోలు చేయనందున యాసంగి లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని అన్నారు. రైతులు తమ సొంత భరోసా మరియు మిల్లర్లు, సీడ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న రైతులు మాత్రమే వరి పంట వేసుకోవాలని సూచించారు. ఒప్పందం చేసుకోని రైతులు వరి పంట వేసుకుంటే ధాన్యాన్ని సొంతంగానే అమ్ముకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ శ్రీనివాస్ కుమార్, ఇంచార్జి డీసీఓ నీరజ, డి సి ఎస్ ఓ వసంతలక్ష్మి, డియం సివిల్ సప్లయ్ క్రిష్ణవేణి, ఎంపిడిఓ వెంకటరమణ, డిటి రమేష్, ఏ ఈఓ హీన తదితరులు పాల్గొన్నారు.

Share This Post