రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించేలా క్షేత్ర స్థాయిలో అవగాహన కలిగించాలని – జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్

రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించేలా క్షేత్ర స్థాయిలో అవగాహన కలిగించాలని – జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్

యాసంగి లో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించేలా క్షేత్ర స్థాయిలో అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ వ్యవసాయాధికారులకు, ఆర్.డి.ఓ.లు , తహసీల్ధార్లకు సూచించారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ రూపొందించుకొని ప్రతి రోజు 3 , 4 గ్రామాల చొప్పున శుక్రవారం వరకు అన్ని గ్రామాలను కవర్ చేస్తూ రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు వేయాలని, పంట మార్పిడి వలనే మేలు జరుగుతుందన్న విషయాన్ని స్పష్టంగా వివరించాలని అన్నారు. సోమవారం అదనపు కలెక్టర్లు, ఆర్.డి.ఓ.లు, వ్యవసాయాధికారులు, తహసీల్ధార్లు, సంబంధిత జిల్లా అధికారులతో వ్యవసాయం, ధాన్యం కొనుగోలుపై, వైద్యాధికారులతో రెండో డోసు కోవిడ్ టీకాపై సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
ముందుగా వ్యవసాయంపై సమీక్షిస్తూ ఇటీవల జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్సులో కేంద్ర ప్రభుత్వం యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమని ఖరాకండిగా చెప్పినందున రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపేలా ప్రోత్సహించాలని, రెండో డోసువాక్సిన్ ను ఈ నెలాఖరు లోగా వంద శాతం ఇచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారని అన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి తో పాటు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రులు, పౌర సరఫరాల కమీషనర్లు పలుమార్లు ఢిల్లీ కి వెళ్లి యాసంగి పంట కొనుగోలుపై స్పష్టమైన హామీ ఇవ్వవలసినదిగా కేంద్ర ప్రభుత్వాన్నికోరగా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఎట్టి పరిస్థితులలో యాసంగి పంటను కొనుగోలు చేయమని స్పష్టం చేస్తూ, అందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తూ లిఖిత పూర్వక హామీ ఇస్తేనే ఈ వానా కాలం పంట కొనుగోలు చేస్తామని చెప్పారని కలెక్టర్ గుర్తు చేశారు. యాసంగిలో దొడ్డు రకం ధాన్యం నూకగా వస్తుంది కాబట్టి ప్రభుత్వం కొనుగోలు చేయదని, కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయబడవని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడ యాసంగి పంటను ఎఫ్.సి.ఏ. కొనుగోలు చేయదు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా వరి పంట వేయరాదని రైతులకు చెప్పాలని అన్నారు.
ఒకవేళ రైతులు ఇంటి అవసరాల మేరకు వరి పండించుకుంటే పరవాలేదని, కానీ పూర్తిగా వరి వేస్తే మాత్రం అట్టి పంటను వారే సొంతంగా అమ్ముకునేందుకు ఏర్పాటు చేసుకోవాలని సూచించాలన్నారు. ఎక్కువకాలం వరి పండిస్తే భూమి సారం కోల్పోతుందని కాబట్టి ప్రత్యామ్నాయ పంటలైన కందులు, మినుములు, పేసర్లు, వేరుశనగ, నువ్వులు, పత్తి, ఆయిల్ సీడ్స్ వంటి పంటలు పండించే విధంగా రైతులను చైతన్య పరిచేలా చూడాలని వ్యవసాయ విస్తరణాధికారులకు సూచించించారు. అదేవిధంగా ఆరుతడి పంటలు పండిస్తే భూసారాన్ని రక్షించుకోవచ్చని, తక్కువ నీటితో ఎక్కువ పంట సాగు చేయవచ్చని, తక్కువ ఖర్చుతో అధిక లాభం పొందవచ్చని, ఇందుకు సంబంధించి శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు పాటించి మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు, కూరగాయల సాగుపై దృష్టి సారించేలా చూడాలని అధికారులకు సూచించారు. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా క్లస్టర్ ల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించాలని, ఇందులో సర్పంచులు, జెడ్.పి .టి.సి., ఏం.పి .టి.సి. ల ను భాగస్వాములను చేయాలని సూచించారు.
అనంతరం కోవిడ్ వ్యాక్సిన్ గురించి మాట్లాడుతూ జిల్లాలో మొదటి డోసు లక్ష్యాన్ని మించి వేశామని, కానీ రెండవ డోసు సుమారు 60 శాతం మాత్రమే అయినదని, ఈ నెలాఖరునాటికి వంద శాతం వ్యాక్సిన్ వేసేలా చూడాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సూచించారు. వైద్యాధికారులు, ఏం.పి .డి.ఓ.లు, ఏం.పి .ఓ.లు హెడ్ క్వార్టర్ వదిలివెళ్లకుండా, ఉపయోగిచుకోకుండా ఈ వారం రోజులు పగలు, రాత్రి సీరియస్ గా కష్టపడి పనిచేస్తే శతశాతం లక్ష్యాన్ని సాధిస్తామని అన్నారు. టేక్మాల్, , రేగోడ్, అల్లాదుర్గ్ వంటి మండలాలలో చాలా వెనుకబడి ఉన్నారని, సంబంధిత పి .హెచ్.సి.లు ప్రత్యేక దృష్టి పెట్టి అంగన్వాడీ, ఏ.యెన్.ఏం ల సహకారంతో మొదటి డోసు వేసుకున్న ప్రతి ఒక్కరు రెండో డోసు టీకా వేసుకునేలా చూడాలని, అన్నారు. కాగా ఆఫ్ లైన్ , ఆన్ లైన్ లో టీకా వేసిన వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలని సూచించారు.ఈ టెలికాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, రమేష్, జిల్లా పరిషద్ సి.ఈ.ఓ. శైలేష్, డి.పి .ఓ. తరుణ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకటేశ్వర్ రావు, ఆర్.డి.ఓ.లు సాయి రామ్, శ్యామ్ ప్రకాష్, జిల్లా వ్యవసాయాధికారి పరశురామ్ నాయక్, తహసీల్ధార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Share This Post