రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలి :: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

ప్రచురణార్థం-3
జనగామ, డిసెంబర్ : 10: రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లె గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి కొనుగోలు చేసిన వివరాలు, రైతులకు సెంటర్లో అందిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే తరలించాలని అన్నారు.
అనంతరం పాలకుర్తి మండలం తహసిల్దార్ కార్యాలయంలో ప్రత్యామ్నాయ పంటలు, వ్యాక్సినేషన్ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎండాకాలంలో వరి పంటను ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశం లేనందున రైతులు ప్రత్యామ్నాయ పంటలకు వెళ్ళవలసిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పించడానికి వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణ అధికారులు విస్తృతంగా అవగాహన, ప్రచారం నిర్వహించి రైతులను చైతన్య పరచాలని అన్నారు.
అదే విధంగా జిల్లా వ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతున్నది కావున జిల్లాలోని ప్రజలు అందరు తమ వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాలని, వాక్సిన్ తీసుకున్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. ప్రజలు అధికంగా ఉన్న ప్రదేశాలలో తప్పనిసరిగా సానిటైజేషన్ చేసుకొని బౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఏ.భాస్కర్ రావు, స్టేషన్ ఘనపూర్ ఆర్డిఓ కృష్ణవేణి, తహసిల్దార్ విజయ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.


Share This Post