రైతుల శ్రేయస్సు కోరి.. వారితో మమేకమై… యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను రైతులు సాగు చేయాలి ప్రత్యామ్నాయ పంటల సాగుతో కలిగే లాభాలపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్న జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ప్రచురణార్థం-3
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 8: యాసంగిలో భారత ఆహార సంస్థ ధాన్యం కొనుగోలు చేసే అవకాశం లేనందున ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయదని, వరి పంటకు బదులుగా రైతులు, ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి రైతులకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. బుధవారం కలెక్టర్ వేములవాడ రూరల్ మండలం చెక్కపెల్లి గ్రామంలోని రైతులతో మమేకమై, ప్రత్యామ్నాయ పంటల సాగుతో కలిగే లాభాలపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించారు. రైతుల శ్రేయస్సు కోరి ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించి యాసంగిలో వరిని సాగు చేయవద్దని రైతులను కోరుతుందని కలెక్టర్ తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రభుత్వం చేసే అవకాశం లేనందున రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా చూడాలని అవగాహన కల్పించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులకు ఎక్కువ లాభం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రైతులకు ఈ ఆరుతడి పంటల సాగు గురించి సరైన అవగాహన కల్పించడానికి తమ వ్యవసాయ విస్తరణ అధికారి అందుబాటులో ఉంటారని, వారి నుండి సలహాలు, సూచనలు పాటిస్తూ రైతులు పంటల సాగుకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
అంతకముందు కలెక్టర్ సిరిసిల్ల పట్టణంలోని సినారె కళామందిర్ లో నిర్వహిస్తున్న ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. వ్యాక్సిన్ అందరూ వేసుకునేలా సిబ్బంది అవగాహన కల్పించాలని, రెండవ డోస్ కు అర్హులై కూడా ఇంకా వ్యాక్సిన్ తీసుకోని వారిపై దృష్టి సారించి, వారికి వ్యాక్సిన్ వేయాలని కలెక్టర్ ఆదేశించారు.

Share This Post