రైతువేదికలకు చేయూతనివ్వడం ఎంతో ఆనందకరం
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీష్
జిల్లాలోని రైతువేదికలకు ప్రైవేట్ సంస్థలు తమ చేయూతనివ్వడం ఎంతో ఆనందకరమని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ అన్నారు. గురువారం జిల్లాలోని మేడ్చల్ మండల పరిధిలో ఉన్న రాయిలాపూర్ ఏఈవో క్టస్టర్ రైతువేదిక, పూడూరు ఏఈవో క్లస్టర్ రైతువేదికలకు హెచ్ఎమ్ క్లాస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో సమకూర్చిన రెండు సిస్టమ్స్‌ను జిల్లా కలెక్టర్‌కు అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ రైతులకు సౌకర్యవంతంగా ఉండి వారికి అన్ని రకాలుగా తోడ్పాటునందించేందుకు ప్రభుత్వం రైతువేదికలను నిర్మించిందని… వాటికి ఆయా సంస్థల ఆధ్వర్యంలో చేయూతనివ్వడం అందరికీ ఆదర్శమని అన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతువేదికలకు తమ సహాయ సహకారాలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారిణి మేరి రేఖ, మేడ్చల్ ఏడీఏ వెంకట రామిరెడ్డి, మండల వ్యవసాయాధికారులు అర్చన, సుధారాణి, హెచ్ఎమ్ క్లాస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు వెంకటేశ్వర్లు, మీనాక్షి, మోషిని తదితరులు పాల్గొన్నారు.