రైతు బీమాపై ప్రతీ రైతుకు అవగాహన కల్పించాలి- జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేష్

రైతు బీమాపై ప్రతీ రైతుకు అవగాహన కల్పించాలని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేష్ అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్తు స్థాయి సంఘాల సమావేశం జిల్లా పరిషత్తు వైస్ ఛైర్మన్ ఈట గణేష్ అధ్యక్షతన నిర్వహించారు. స్థాయి సంఘాల సమావేశం-5 ( స్త్రీ మరియు శిశు సంక్షేమం), సాంఘిక సంక్షేమం 6 ) స్థాయి సంఘము-3 వ్యవసాయం పై సమీక్షా సమావేశంలో జిల్లా పరిషత్తు వైస్ ఛైర్మన్ మాట్లాడుతూ రైతులకు రైతు బీమా పై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతీ గ్రామ పంచాయతీలో దండోరా, టామ్ టామ్ వేయించి రైతు బీమా పై ప్రతీ రైతుకు తెలియజేయాలని అన్నారు. రంగారెడ్డి జిల్లాకు రైతు బంధు కింద పెండింగులో ఉన్న 2, 3 వ విడత కింద 350 కోట్ల రూపాయలు విడుదల చేయాలని కమిటీ తీర్మానం చేశారు. నాబార్డు కింద ప్రతి మండలానికి ఒక గోడౌన్ నిర్మాణం పెండింగులో ఉన్న ప్రతిపాదనలు కేంద్రానికి ఈ నెల 30 లోపు పంపాలని నిర్ణయించారు. ధాన్యం ప్రొక్యూర్ మెంట్ జరుగుతున్న సమయంలో అన్ని సెంటర్లకు స్టోరేజ్ కి అనుగుణంగా పంపాలని సంబంధిత అధికారులకు సూచించారు. పాడి ఆవుల కొరకు డీ.డీ.లు కట్టిన రైతులకు ఆవులను అందజేయాలని తలకొండపల్లి జడ్పిటీసీ కోరారు. చనిపోయిన పశువుల లబ్దిదారులకు ఇన్సూరెన్స్ ద్వారా పాడి పశువులను పంపిణీ చేయాలని పశు సంవర్థక శాఖ అధికారిని కోరారు.
జిల్లాలోని ఉద్యానవన శాఖలో 38 పోస్టులకు గాను 7 పోస్టులు మాత్రమే ఉన్నాయని మిగిలిన పోస్టులను తాత్కాలికంగా భర్తీ చేయాలని కోరారు.
మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు కింద డ్రిప్పు పై షెడ్యూల్ తెగల వారికి 100 శాతం, వెనుకబడిన తరగతుల వారికి 90 శాతం ఇతర రైతులకు 80శాతం రాయితీలను చిన్న సన్నకారు రైతులకు , వికలాంగులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు.
ప్రకృతి వైపరీత్యం కింద పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు.
మహిళా సంక్షేమం పై జడ్పి సీఈఓ దిలీప్ కుమార్ సమీక్షిస్తూ సెప్టెంబర్ 1 నుండి అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభం అయినందున పిల్లల్లో ఎత్తు బరువు ఎప్పటికప్పుడు కొలవాలన్నారు. అనిమియా వ్యాధి రాకుండా ఉండేందుకు గర్భిణీలకు బాలింతలకు అవగాహన కల్పించాలని అన్నారు. పిల్లల పెరుగుదలకు పౌష్టికాహారం ఇవ్వాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలలో నీటి వసతి కల్పించాలని ఆదేశించారు. జిల్లాలో మరుగుదొడ్లు లేని అంగన్వాడీ కేంద్రాలలో మరుగుదొడ్లను నిర్మించాలని అన్నారు. బాల్య వివాహాలు జరగకుండా పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు. పిల్లలు రోడ్ల పైన తిరగకుండా చైల్డ్ లైన్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.

స్థాయి సంఘం 6 సాంఘీక సంక్షేమ కార్యక్రమాలపై డిప్యూటీ సీఈఓ బీ. రంగారావు సమీక్షిస్తూ షెడ్యూల్ కులాల, వెనుక బడిన తరగతుల , మైనారిటీల గురుకుల వసతి గృహాల్లో చేరే విద్యార్థులకు ఐడెంటిటీ కార్డు ఇవ్వాలని అన్నారు. వసతి గృహాల్లోని విద్యార్థులకు పటిష్టమైన భద్రత కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వసతి గృహాలకు వాచ్ మెన్ ఉన్నారా లేరా అని అడిగి తెలుసుకున్నారు. వాచ్ మెన్ పోస్టులు ఖాళీగా ఉంటే వెంటనే వాటిని తాత్కాలిక పద్దతిలో భర్తీ చేయాలని అన్నారు. స్థాయి సంఘాల సమావేశానికి పూర్తి సమాచారంతో రావాలని బీసీ సంక్షేమశాఖ అధికారిని ఆదేశించారు.

ఈ సమావేశంలో జెడ్పీటీసీలు, వెంకటేష్, అనురాధ, స్వరూప, టీ విశాల, నిత్య, జంగారెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి గీతా రెడ్డి , మర్కెటింగ్ శాఖ అధికారి ఛాయా దేవి, పశు సంవర్థక శాఖ అధికారి అంజిలప్ప, మహిళ సంక్షేమాది కారి మోతి, మైనార్టీ సంక్షేమాధికారి రత్న కళ్యాణి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి రామేశ్వరి, అటవీశాఖ అధికారి జే. ఆనందరావు మార్కెఫెడ్ అధికారి తహ్మీనా, కోపరేటివ్ అసిస్టెంట్ రిజిస్టర్ బీ.శాంతా బాయ్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post