రైతు సదస్సు మరియు వ్యవసాయ ప్రదర్శన లో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్. (కరీంనగర్ జిల్లా)

ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టిసారించాలి

పంట మార్పిడి వల్లనే రైతులకు మేలు కలుగుతుంది

వ్యవసాయ కళాశాలల విద్యార్థులు రైతుల అనుభవాలు తెలుసుకోవాలి

జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్

రైతు సదస్సు – వ్యవసాయ ప్రదర్శన ప్రారంభించిన కలెక్టర్
00000

యాసంగి లో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని, ఆరుతడి పంటలు, పంట మార్పిడి వల్లనే రైతులకు మేలు కలుగుతుందని జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ అన్నారు.

శనివారం కరీంనగర్ శివారు పద్మా నగర్ లోని జిల్లా ఏరువాక కేంద్రం- వ్యవసాయ పరిశోధన స్థానంలో ఏర్పాటుచేసిన రైతు సదస్సు- వ్యవసాయ ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ముందుగా వ్యవసాయ పరిశోధన స్థానం లో హైదరాబాద్ ఐఐటీ విద్యార్థులు రూపొందించిన డ్రోన్ యంత్రాన్ని తిలకించారు. పంట పొలాలకు డ్రోన్ సహాయంతో పురుగు మందులను ఎకరానికి పది లీటర్ల మందును 10 నిమిషాల్లో స్ప్రే చేస్తుందని వ్యవసాయ అధికారులు కలెక్టర్ కు వివరించారు. డ్రోన్ పని చేసే విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. అలాగే ఇతర ఆధునిక యంత్రాలను ఆయన పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరము వ్యవసాయ ప్రదర్శన ను ప్రారంభించారు. విత్తనాలు, సమగ్ర సస్యరక్షణ, ఆరుతడి పంటల వంగడాలు, మల్చింగ్ విధానాలు, మొక్కలు, సమగ్ర వ్యవసాయము, తుంపర సేద్యం, బిందు సేద్యం, నిలువు వ్యవసాయం, ఆక్వా పోనిక్స్, హైడ్రోపోనిక్స్, సోలార్ డ్రయర్, మంకీ గన్, క్రాప్ అడ్వైజరీ సెంటర్, కార్బన్ సేంద్రియ ఎరువు తదితర ప్రదర్శనలను తిలకించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఖరీఫ్ లో వరి వేసినప్పటికీ యాసంగి లో ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని సూచించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పనిముట్ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పంటలు సాగు చేయాలని తెలిపారు. రైతులు ఒకరికి ఒకరు తమ అనుభవాలను పంచుకోవాలని, పంటల దిగుబడిపై వ్యవసాయ అధికారుల సూచనల తీసుకోవాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వ్యవసాయ కళాశాలలో విద్య నభ్యసిస్తున్న వ్యవసాయ విద్యార్థులు రైతుల పంట పొలాలను సందర్శించాలని, రైతుల అనుభవాలు అడిగి తెలుసుకోవాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో తిరగడం వల్ల విద్యార్థులకు వ్యవసాయ విధానాలపై అవగాహన కలుగుతుందని తెలిపారు.

Share This Post