ఆగష్టు 28, 2021 – ఆదిలాబాదు:-
జిల్లాలోని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి వైద్యాధికారులు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం రోజున ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత కలెక్టర్ ప్రసూతి వార్డ్, ఇతర వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న దృష్ట్యా రోగుల సంఖ్య పెరుగుతున్నదని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించడం జరుగుచున్నదని తెలిపారు. వైరల్ జ్వరాలు, సీజనల్ వ్యాధుల వలన ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారని తెలిపారు. మెరుగైన వైద్య సేవలు అందించడానికి వైద్యులు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, నిర్ణిత సమయానికి వైద్య సిబ్బంది విధులకు హాజరు కావాలని, బయో మెట్రిక్ అటెండన్స్ నిర్వహిచాలని రిమ్స్ డైరెక్టర్ ను ఆదేశించారు. రోగుల తాకిడి ఎక్కువ ఉన్న దృష్ట్యా వెయిటింగ్ మేనేజ్మెంట్ సిస్టం ఏర్పాటు చేసి బాధ్యత గల అధికారులను, వైద్యుడిని నియమించి వైద్య సేవలు అందించాలని అన్నారు. గర్భిణీలు, ప్రసూతి కోసం వచ్చే వారికీ ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. వైరల్ జ్వరాలతో పాటు, ప్రస్తుతం కోవిడ్ దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రిమ్స్ ఆసుపత్రికి కావాల్సిన సౌకర్యాలు జిల్లా యంత్రాంగం సమకూర్చడనికి చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమం లో రిమ్స్ డైరెక్టర్ డా.కరుణాకర్, వైద్యులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.