ప్రచురణార్థం
రోడ్డుకు ఇరువైపలా మొక్కలు నాటి వెంటనే రిపోర్టు చేయాలి — జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
మహబూబాబాద్, ఆగస్ట్-12:
గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మహబూబాబాద్ మండలం అయోధ్య, ఉత్తరతండ లలో అవెన్యూ ప్లాంటేషన్, హరితహారం కార్యక్రమాల అమలు తీరును స్వయంగా సందర్శించి పరిశీలించారు. ముందుగా అయోధ్యలో ప్రధాన రహదారికి ఇరువైపలా మొక్కలు నాటి లేకపోవడంతో ఎంపిడిఓ రవీందర్, పంచాయితీ సెక్రటరీ హన్మంతు లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై మాసం నుండి ఇప్పటి వరకు ఇచ్చిన లక్ష్యాన్ని 40 రోజులైనప్పటికీ పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎంపిడిఓ, పంచాయితీ సెక్రటరీ లు మాట్లాడుతూ ఆయోధ్య జి.పి.లో 22 వేలకు గాను 8000 మొక్కలు గ్రామంలో నాటడం జరిగిందని, ఇందులో 446 ఇళ్లకు 6 మొక్కలు చొప్పున ఇచ్చామని తెలిపారు. ఇంకను 14 వేల మొక్కలు లక్ష్యం పూర్తి చేయాల్సి వున్నదని, కూలీల కొరతవలన రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటలేదని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ఇప్పటికే చాలా రోజులు సమయం ఇవ్వడం జరిగిందని, వెంటనే రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి రిపోర్టు చేయాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా అయోధ్య గ్రామ పంచాయతీ నర్సరిని పరిశీలించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కల వివరాలను నర్సరీకి సంబంధించిన రిజిష్టర్ ను పరిశీలించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఉత్తర తండలో రోడ్డుకు ఇరువైపులా నాటుతున్న మొక్కలను పరిశీలించారు. రోడ్డుకిరువైపులా మొక్కలు ఈరోజు సాయంత్రంలోగా నాటి, వాటికి ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేసి ఫోటోలు తీసి రిపోర్టు చేయాలని ఎంపీడీవో రవీందర్, పంచాయతీ సెక్రెటరీ స్వప్న ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ టి.రమాదేవి, ఇంచార్జ్ ఎపిఓ శ్రవణ్, ఆయా గ్రామాల సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు———————————————————– జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయడమైనది