రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు – కలెక్టర్ హరీష్

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు  – కలెక్టర్ హరీష్

జిల్లాలో జాతీయ,రాష్ట్ర, గ్రామీణ రహదారులతో ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించిన బ్లాక్ స్పాట్ ప్రాంతాలలో స్పీడ్ బ్రేకర్లు, స్టడ్స్ , బ్లింకర్ లైట్లు, కల్వర్టుల వద్ద, అండర్ పాస్ ల వద్ద రేడియం స్టిక్కర్లు, టి ఎండ్ గల రోడ్ ప్రాంతాలలో సైన్ బోర్డులు పెట్టవలసినదిగా జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ అధికారాలకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హల్ లో రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ప్రధానంగా జంక్షన్లు, యు టర్న్ లు, పాదాచారులు రోడ్డు దాటేటప్పుడు, వేగంగా వెళ్లడం, రాంగ్ సైడ్ లో డ్రైవ్ చేయడం, చిన్న, పెద్ద రోడ్లు కలిసే ప్రాంతాలు, వెళుతూ సరిగా లేని ప్రాంతాలలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించామని అన్నారు. ప్రమాదంలో మృతి చెందిన సంఖ్యను బట్టి ఏ.బి.సి. అని మూడు క్యాటగిరీలుగా బ్లాక్ స్పాట్ లను గుర్తించామని, అందుకనుగుణంగా అధికారులు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. తూప్రాన్ జాతీయ రహదారుల వెంట రోడ్డు భద్రత నిబంధనలను ఉల్లంఘించిన డాబాలకు తగు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని, పచ్చదనానీకి విరివిగా మొక్కలు నాటేలా చూడాలని కోరారు. రోడ్డు వెంట ముళ్ళ పొదలు, చెట్ల పొదలు తొలగిస్తూ మలుపుల వద్ద సూచిక బోర్డులు, బాణం గుర్తులు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ వంటి ప్రధాన రహదారుల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉంటున్నందున రోడ్డు భద్రతా మార్గదర్శకాలకనుగుణంగా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.
రోడ్డు ప్యాచ్ వర్క్ లు ఎప్పటికప్పుడు చేపట్టాలని, అవసరమైన ప్రాంతాలవద్ద అండర్ పాస్ రోడ్లు నిర్మించాలని, బై పాస్ రోడ్ నుండి ప్రధాన రహదారి పైకి వచ్చే మార్గం సమాంతరంగా ఉండేలా చూడాలని అన్నారు. వడియారం జంక్షన్ దగ్గర ప్రమాదాల నివారణకు అండర్ పాస్ ఏర్పాటు చేయుటకు ప్రతిపాదనలు పంపాలని లేనిచో సర్వీస్ రోడ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. చేగుంట గోల్డెన్ డాబా దగ్గర ప్రమాదాలు జరుగుచున్నందున బ్లాక్ స్పాట్ పనులను వెంటనే చేపట్టాలని అన్నారు.
మెదక్, నర్సాపూర్ నుండి హైదరాబాద్ వెళ్ళే రహాదారిలో ఈ మధ్య కాలంలో రోజు కనీసం ఒక కోతి అయినా చనిపోతుండడం బాధాకరమని , వాహనదారులు కోతులకు తినుబండారాలు వేయకుండా, ప్లాస్టిక్ కవర్లో అందించకుండా చూడాలని అన్నారు. రోడ్లపై వాహానాలు నిలుపడం రోడ్డు భద్రతకు విఘాతం కలగడంతో పాటు, ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల వాతావరణం కాలుష్యానికి కారకులవుతున్నారని, కాబట్టి పొలిసు, అటవీ, ఆర్.టి.ఓ. జాతీయ , రాష్ట్ర రహదారుల అధికారులు సమీష్టిగా అటువంటి వారిని గుర్తించి వైల్డ్ లైఫ్, జాతీయ రోడ్డు భద్రత, వయొలెన్స్ వంటి కేసులు నమోదు చేయాలని, అప్పుడే కొంత వరకు నియంత్రణలోకి వస్తుందని అన్నారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, అదనపు ఎస్పీ కృష్ణ మూర్తి, జిల్లా రవాణాధికారి శ్రీనివాస్ గౌడ్, ఆబ్కారీ శాఖా సూపరింటెండెంట్ రజాక్, యెన్.హెచ్. ఈఈ ధర్మా రెడ్డి, తరుణ్ కుమార్, ఆర్ అండ్ బి ఈఈ శ్యామ్ సుందర్, మునిసిపల్ కమీషనర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Share This Post