పత్రిక ప్రకటన–1 తేదీ : 29–11–2022
==============================================
జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలి,
రోడ్డు భద్రత సమీక్ష సమావేశంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి,
రోడ్డు భద్రతతో పాటు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లాలోని ప్రజలందరికీ అవగాహన కల్పించి ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు వెళ్ళాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం శామీర్పేట్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రోడ్డు భద్రతలపై రోడ్డు, భవనాలు, పంచాయతీరాజ్, జిల్లా రవాణా శాఖ, భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ), పోలీసు, ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీసీ, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా నేషనల్ హైవేతో పాటు రాజీవ్ రహదారి ఉన్నాయని ఆయా ప్రాంతాల్లో ఎక్కడ కూడా ప్రమాదాలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో ఆయా శాఖలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రమాదాలు జరిగిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం కంటే అసలు ప్రమాదాలు జరగకుండానే ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఈ విషయంలో జాతీయ రహదారి, రాజీవ్ రహదారితో పాటు పలు రహదారులపై స్పీడ్ లిమిట్స్ బోర్డులను, స్పీడ్ గన్స్ ఏర్పాటు చేయాల్సిందిగా తెలిపారు. దీనివల్ల వాహనదారులు ఎక్కవ స్పీడ్తో వెళ్ళకుండా నిర్ణీత వేగంతో వెళ్ళడం వల్ల ప్రమాదాలు జరగకుండా ఉంటుందని పేర్కొన్నారు. దీంతో పాటు గతంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగిన చోట్ల, రహదారుల వద్ద మూలమలుపులు, పాఠశాలలు, కళాశాలల వద్ద సిగ్నల్ బోర్డులను ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ విషయాల్లో ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను సంబంధిత శాఖ అధికారులను అడిగి తెలుసుకొని వారికి పలు సూచనలు, సలహాలు చేశారు. అలాగే రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసులు, ట్రాఫిక్ పోలీసులతో పాటు రవాణా శాఖ అధికారులు ప్రత్యేకంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఈ విషయంలో అధికారులు సమన్వయంతో ముందుకెళ్ళితే ప్రమాదాలు పూర్తిగా తగ్గే అవకాశముందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయా శాఖల అధికారులు అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి దృష్టికి తీసుకురాగా వాటిని తీసుకోవాల్సిన చర్యల గురించి అవసరమైన సూచనలిచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో గతంలో నిర్వహించిన సమావేశాలపై చేపట్టిన చర్యలు, తదితర విషయాలను అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి సంబంధిత శాఖల అధికారులను ప్రత్యేకంగా అడిగి తెలుసుకొన్నారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సమావేశంలో సూచించిన విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్ అండ్ బీ ఈఈ శ్రీనివాసమూర్తి, ఆర్టీవో కిషన్ నాయక్, పంచాయతీరాజ్ ఈఈ రామ్మోహన్, ఆర్టీసీ, డియం చంద్రకాంత్. పోలీసు, ట్రాఫిక్, మున్సిపల్ కమిషనర్లు,జాతీయ రహదారుల సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.