రోడ్డు భద్రత అందరి బాధ్యత :: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

 

మానవ తప్పిదాల వల్లే దాదాపు 91శాతం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, చిన్నపాటి నియంత్రణతో ఇలాంటి ప్రమాదాల నుండి తప్పించుకునే అవకాశం ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బుధవారం ఆధునీకరించి, పునరుద్ధరించిన పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ లో రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి మాట్లాడుతూ, జిల్లాలో జాతీయ రహదారుల ప్రమాదాలు గత సంవత్సరంతో పోల్చితే తగ్గాయన్నారు. జిల్లా వ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రహదారుల్లో జరుగుతున్న ప్రమాదాలపై విశ్లేషించి రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు చర్యలు చేపట్టేందుకు పోలీసు శాఖ, పంచాయతీ రాజ్ శాఖ, రవాణా శాఖ, రెవెన్యూ, నేషనల్ హైవే, ఆర్‌అండ్‌బీ అధికారులు క్షేత్రస్ధాయిలో కృషి చేయాలని అన్నారు. నగరం నలువైపుల నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం జరుపుతుందని తద్వారా ప్రమాదాలు జరగకుండా ముందస్తు ప్రణాళికతో రోడ్డు భద్రతా మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా వేగ నియంత్రికలు, సూచిక బోర్డుల ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ, రాష్ట్ర, ఇతర ప్రధాన రహదారులకు వివిధ గ్రామాలు, ప్రాంతాల నుంచి అనుసంధానం చేసే రోడ్లపై అవసరమైన చోట్ల వేగ నియంత్రికలు నిర్మించాలని, ఫలితంగా వాహన చోదకుడు వేగాన్ని తగ్గించి, చుట్టుపక్కల వాహనాలను గమనించి ముందుకు వెళ్లే ఆవకాశం వుంటుందని అన్నారు. అదే సమయంలో ప్రధాన రహదారులపై హెచ్చరిక బోర్డులు (సైన్‌ బోర్డులు), దారి మలుపులను తెలిపే సూచిక బోర్డులు, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ లైట్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటికే సమావేశాలు,ప్రణాళికల ద్వారా ప్రమాదాలను కట్టడికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, ప్రతి మూడు మాసాలకు రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం చేపట్టి, ప్రమాదాల నియంత్రణకై చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గత సమావేశంలో గుర్తించిన సమస్యలపై తీసుకున్న చర్యలపై ఈ సమావేశంలో సమీక్షిస్తున్నట్లు ఆయన అన్నారు. పోలీస్ స్టేషన్, సర్కిల్ పరిధిలో ఏ ఏ చోట్ల బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో గుర్తించి, అవి ఏ ఏ రోడ్స్ పై వస్తున్నాయో చూసి, తాత్కాలిక, శాశ్వత నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు.
సమావేశంలో పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ మాట్లాడుతూ, పోలీస్ అధికారులు క్రియాశీలకంగా ఉండి, ప్రమాద ప్రదేశాలపై సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయం చేయాలన్నారు.

ఈ సమావేశంలో ఎంపి వద్దిరాజు రవిచంద్ర, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ గారు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు డిసిపిలు, ఆర్ అండ్ బి ఇఇ శ్యామ్ ప్రసాద్, నేషనల్ హైవే పిడి దుర్గాప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. మాలతి, జిల్లా విద్యాధికారి యాదయ్య,జిల్లా రవాణాధికారి కిషన్ రావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేందర్ రెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post