లక్కీ డ్రా ద్వారా మద్యం షాపుల కేటాయింపు:: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 30: జిల్లాలో దరఖాస్తులు తక్కువగా వచ్చిన కారణంగా లైసెన్స్ కొరకు లక్కీ డ్రా నిర్వహించకుండా నిలిపివేసిన రెండు షాపులకు లక్కీ డ్రా ద్వారా కేటాయింపులు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో రెండు షాపులకు కలెక్టర్ లక్కీ డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 48 మద్యం షాపులకుగాను ఈ నెల 20 న 46 షాపులకు లక్కీ డ్రా ద్వారా కేటాయింపు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు దరఖాస్తులు తక్కువగా వచ్చిన కారణంగా కోనారావుపేట మండలం నిమ్మపల్లి, రుద్రంగిలలో ఉన్న మద్యం షాపులకు లక్కీ డ్రా తాత్కాలికంగా నిలిపినట్లు తెలిపారు. అట్టి షాపులకు దరఖాస్తులు ఈ నెల 29 వరకు స్వీకరణకు గడువు ఇవ్వగా, నిమ్మపల్లి షాపుకు 26, రుద్రంగి షాపు కొరకు 31 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన అబ్కారి చట్టం ప్రకారం దరఖాస్తుదారుల సమక్షంలో లక్కీ డ్రా ద్వారా పూర్తి పారదర్శకంగా కేటాయింపు ప్రక్రియ పూర్తి చేసినట్లు, ప్రక్రియ అంతా వీడియోగ్రఫీ చేయించినట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ నుండి ప్రత్యేక అధికారి ప్రదీప్ రావు, సిఐలు ఎంపీఆర్. చంద్రశేఖర్, జి. రాము, ఎస్సైలు శ్రీనివాస్, స్వరూప, కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post