లక్ష్మీ పుష్కరిణి, కల్యాణ కట్ట, టెంపుల్ రింగ్ రోడ్, గిరి ప్రదక్షిణ మెట్ల దారి, గోపురం నిర్మాణ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు

యాదాద్రి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం సాయంత్రం కొండ కింద పూర్తయిన లక్ష్మీ పుష్కరిణి, కల్యాణ కట్ట, టెంపుల్ రింగ్ రోడ్ వెంట తిరుగుతూ, గిరి ప్రదక్షిణ మెట్ల దారి, గోపురం దగ్గర నిర్మాణాలను పరిశీలించారు. తుది పనులపై పలు మార్పులు సూచించారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ టెంపుల్ సిటీ నిర్మాణ పనులను సీఎం పర్యవేక్షించారు. మొత్తంగా 250 ఎకరాల్లో విస్తరించి ఉండే ఈ టెంపుల్ సిటీలో 50 ఎకరాల్లో పచ్చదనం, మిగతా 200 ఎకరాల్లో 250 కాటేజీల నిర్మాణం జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. సుమారు 800 నుంచి 1000 గజాల విస్తీర్ణంలో నిర్మించే ఒక్కో కాటేజీలో మొత్తం 4 సూట్లు ఉంటాయన్నారు. దాతల నుంచి విరాళాలు సేకరించిన ధనంతో వైటీడీఏ ఈ కాటేజీలను నిర్మిస్తుందన్నారు. దాతలు సూచించిన పేరును ఆ కాటేజీకి పెట్టుకోవచ్చన్నారు. మొత్తంగా దాదాపు వెయ్యి కుటుంబాలు బస చేసే ఈ సూట్లలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాటేజీలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సరిపడా నీళ్లు, నిరంతర విద్యుత్తు, అన్నిరకాల వసతులు, హంగులు సమకూర్చాలని సీఎం ఆదేశించారు. యాదాద్రి పవిత్రతను కాపాడటానికి అందరూ సహకరించాలని, టెంపుల్ సిటీ పరిధిలో మద్యపానం, ధూమపానం నిషేదాన్ని కఠినతరంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇక్కడ కేవలం శాఖాహారాన్ని మాత్రమే అనుమతించాలని సీఎం కేసీఆర్ సూచించారు.

Share This Post