జిల్లాలోని నీటిపారుదల శాఖ పరిధిలోని ప్రాజెక్టుల క్రింద లక్ష ఎకరాల భూమికి సాగు కోసం నీరు అందించేందుకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజేశంతో కలిసి జిల్లా వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్, నీటిపారుదల, భూగర్భ జల, ప్రణాళిక శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఒక నెల రోజుల్లో జిల్లాలోని ప్రాజెక్టుల పరిధిలో ఇరిగేషన్‌కు సంబంధించి భూ సేకరణ పనులు, మిషన్ కాకతీయ, ట్యాంక్‌ల నిర్మాణం, చెరువులు, కుంటలు, కెనాల్ పనులు పూర్తి చేయాలని, వట్టివాగు, అడ ప్రాజెక్టుల క్రింద రైతులకు లక్ష ఎకరాలకు నీరు అందించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. యాసంగిలో జిల్లాలో సాగు చేయవలసిన పంటలపై రైతులకు సకాలంలో అవగాహన కల్పించాలని, వరిధాన్యం సాగును మినహాయించి పండ్లు, పూలు, కూరగాయలు, చిరుధాన్యాలు, వాణిజ్య పంటలు, పప్పుధాన్యాలు ఇతరత్రా లాభదాయకమైన పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. రైతులు వారు పండించిన పంట దిగుబడి వచ్చిన తరువాత వారి గ్రామాలలోనే విక్రయించుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో గతంలో చేపల పెంపకం 40 ఎకరాల విస్తీర్ణంలో జరిగేదని, ప్రస్తుతం 62 ఎకరాలకు పెరిగిందని, కెనాల్ సమీపంలో చేపల పెంపకం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధిత అనుమతులు త్వరగా ఇచ్చే విధంగా చర్యలు చేపట్టడంతో పాటు చేపల పెంపకం మరింత అభివృద్ధి చెందేందుకు అధికారులు కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్‌రావు, మార్కెటింగ్ అధికారి గజానంద్, ముఖ్య ప్రణాళిక అధికారి రవీందర్, భూగర్భ జల శాఖ అధికారి నవనీత్, మత్స్యశాఖ అధికారి సాంబశివరావు, నీటిపారుదల శాఖ ఈ. ఈ. జె.గుణవంతరావు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.