లబ్దిదారులకు పౌష్టిక ఆహారం అందించాలి :: తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్ కె. తిరుమల్ రెడ్డి

జనగామ, సెప్టెంబర్ 21: లబ్దిదారులకు పౌష్టిక ఆహారం అందించాలని, ఇది ప్రభుత్వ యంత్రాంగ విధి అని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్ కె. తిరుమల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఫుడ్ కమీషన్ చైర్మన్, సభ్యులు జిల్లాలోని బచ్చన్నపేట, నర్మెట్ట, ఘనపూర్ స్టేషన్, చిల్పూర్ మండలాల్లో పర్యటించి జిల్లాలో జాతీయ ఆహార భద్రతా చట్టం అమలును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పర్యటన సందర్భంగా కమీషన్ చైర్మన్, సభ్యులు బచ్చన్నపేట మండల కేంద్రములో గ్రామ పంచాయితి కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించారు. జాతీయ ప్రజా పంపిణీ పథకం భాగంగా రేషన్ షాపుల ద్వారా బియ్యం, చెక్కర, పప్పులు, నూనె, ఇతర ఏ ఏ నిత్యావసరాలు అందుతున్నవి, నెల నెల అందుతున్నవా, సేవల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పంపిణీలో రేషన్ డీలర్లు, ఓటిపి, సర్వర్, ఈ పాస్ సమస్యలు వున్నాయని, కను రెప్పల సరిగా లేక పోతే రేషన్ ఇవ్వలేకపోతున్నామని తెలుపగా, అవసరమైన అన్ని చర్యలు తీసుకొని సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి, బియ్యం, నిత్యావసరాలను పరిశీలించారు. వంట గదిని పరిశీలించి, పరిశుభ్రతను పాటించాలని అన్నారు. పిల్లలతో భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. రేషన్ షాప్ ను తనిఖీ చేసి, ఏ ఏ నిత్యావసరాలు, ఎంత పరిమాణం వున్నది బోర్డుపై ప్రదర్శించాలన్నారు. మండలంలోని కేసిరెడ్డిపల్లి అంగన్వాడి కేంద్రం, ప్రాథమిక పాఠశాలను సందర్శించి, పిల్లలకు అందుతున్న భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలన్నారు. కిచెన్ గార్డేన్లను ఏర్పాటుచేసి, సేంద్రియ పద్దతిలో కూరగాయలు పండించి, పిల్లలకు అందించాలని అన్నారు. నర్మెట్ట మండలం మాన్ సింగ్ తండాలోని అంగన్వాడి కేంద్రం, ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలను సందర్శించి పిల్లలతో మాట్లాడారు. బొమ్మకూరు పంప్ హౌజ్ ను పరిశీలించారు. అనంతరం స్టేషన్ ఘనపూర్ లోని ఎమ్మెల్యే పాయింట్ గోడౌన్ ను తనిఖీ చేసారు. గోడౌన్ లోని బియ్యం, చక్కర బస్తాలను పరిశీలించి స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిసి కెమెరాలు ఏర్పాటుచేయాలని, భద్రత పటిష్టంగా వుండాలని చైర్మన్ అన్నారు. ఘనపూర్ స్టేషన్ లోని ఉన్నత శ్రేణి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసారు. ఆరోగ్య కేంద్రంలో సరఫరా చేస్తున్న భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. గర్భినులకు మంచి పౌష్టిక ఆహారం అందించాలన్నారు. గర్భినులకు కెసిఆర్ కిట్లు ఇస్తున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఫుడ్ కమీషన్ చైర్మన్ మాట్లాడుతూ, ఆహార భద్రతా చట్టం ప్రకారం ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలు, చౌక ధరల దుకాణాల ద్వారా ఇచ్చే బియ్యం, నిత్యావసరాలు, అంగన్వాడీల ద్వారా అందించే ఆహార పదార్థాలు, భోజనం, చిన్న పిల్లలకు అందించే బాలామృతం, మధ్యాహ్న భోజనం ద్వారా స్కూళ్ళలో అందించే భోజనం, కెసిఆర్ కిట్ ద్వారా అందించే ఫలాలను నాలుగు అంశాలుగా వీటన్నింటిని చట్ట పరిధిలోకి తెచ్చి, లబ్దిదారులకు చట్టపరమైన హక్కుగా ఏర్పాటుచేసినట్లు తెలిపారు. లబ్దిదారులకు సక్రమంగా, సరైన రీతిలో అందుతున్నవీ, లేనిదీ, ఎక్కడ ఏ సమస్యలు వున్నవి, వాటిని ఎలా పరిష్కరించాలనే దానిపై దృష్టి పెట్టినట్లు ఆయన అన్నారు. జిల్లా స్థాయిలో సమీక్ష నిర్వహించి, సమీక్షలో అన్ని విషయాలు కూలంకషంగా చర్చిస్తామన్నారు. ఇవన్ని అందజేసే బాధ్యత వున్న ప్రభుత్వ యంత్రాంగం వారి వారి విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. లబ్దిదారులకు నష్టం వాటిల్లిన సందర్భంలో నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించి, సేవలను సద్వినియోగం చేసుకొనేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచి, ఆరోగ్య తెలంగాణాకై చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. దేశ, రాష్ట్ర అభివృద్ధి ఆరోగ్యమైన మానవ సంపదపైనే ఆధారపడివుంటుంది కాబట్టి, ఆరోగ్య సమాజ నిర్మాణం జరగాలన్నారు. అనంతరం చిల్పూరు లోని బుగులు వెంకటేశ్వరస్వామి దేవస్థానం సందర్శించి ప్రత్యెక పూజలు చేసారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్ తో పాటు సభ్యులు ఆర్. శారద, ఎం. భారతి, జెడ్పి సిఇవో విజయలక్ష్మి, డిఆర్డీవో రాంరెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారిణి రోజారాణి, జిల్లా విద్యాధికారి రాము, జిల్లా సంక్షేమ అధికారిణి జయంతి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ సంధ్యా రాణి, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిదులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post