లాటరీ ద్వారా వైన్ షాపుల రిజర్వేషన్ కేటాయింపు ఖరారు:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, నవంబర్ 8: లాటరీ పద్దతి ద్వారా జిల్లాలో వైన్ షాపు రిజర్వేషన్ కేటాయింపు ఖరారు చేసినట్లు జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య తెలిపారు.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు వైన్ షాపుల రిజర్వేషన్ ఖరారు చేసే ప్రక్రియను సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న 47 ఏ4 వైన్ షాపుల్లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు, ఆబ్కారీ శాఖ కమీషనర్ ఆదేశాల మేరకు గౌడ కులస్థులకు 13, ఎస్సీలకు 5, షెడ్యూల్ ప్రాంతంలో లేని ఎస్టీలకు ఒకటి రిజర్వ్ చేసి సదరు షాపులను లాటరీ ద్వారా కేటాయిస్తున్నట్లు తెలిపారు.
పారదర్శకంగా రిజర్వ్ వైన్ షాపులు కేటాయించే విధంగా మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేయడం జరిగిందని ఆయన అన్నారు. మద్యం షాపులు కేటాయించే సమయంలో గౌడ కులస్థులకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు. జిల్లాలో మిగిలిన 28 షాపులకు అన్ని వర్గాల వారు దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. డిసెంబర్ 1, 2021 నుంచి నవంబర్ 30, 2023 వరకు ప్రస్తుతం కేటాయించే షాపుల లైసెన్స్ ఉంటుందని, ప్రతి షాపుకు రూ. 2 లక్షల నాన్ – రిఫండబుల్ దరఖాస్తు రుసుముతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ అన్నారు. వైన్ షాపు కేటాయింపు ప్రక్రియ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల స్వీకరణ మొదలైన అంశాల షెడ్యుల్ ను అబ్కారీ శాఖ కమిషనర్/సంచాలకులు ప్రకటిస్తారని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఆర్.మహిపాల్ రెడ్డి, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అభివృద్ధి అధికారిణి ఆర్ . ప్రేమకళ, జిల్లా బిసి సంక్షేమ అధికారి బి.రవీందర్, జిల్లా ఎస్సి అభివృద్ధి అధికారి కోర్నిలియెస్ పాల్గొన్నారు.

Share This Post