ప్రచురణార్థం
లాభదాయకమైన ఆయిల్ పామ్ సాగుకు రైతులను ప్రోత్సహించాలి …. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ
*ప్రతి ఎకరానికి ప్రభుత్వం సంవత్సరానికి 4200 సబ్సిడీ అందజేత
*ఫిబ్రవరి చివరి నాటికి మరో 1500 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు
*ఆయిల్ పామ్ సాగు మంజూరు చేసి డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను త్వరితగతిన పూర్తి చేయాలి
*ఆయిల్ పామ్ సాగు ప్రయోజనాలను విస్తృతంగా అవగాహన కల్పించాలి
*ఆయిల్ పామ్ సాగు లక్ష్యాల పై అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్
—————————–
పెద్దపల్లి, ఫిబ్రవరి -03:
—————————–
జిల్లాలో లాభదాయకమైన ఆయిల్ పామ్ సాగుకు రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ తెలిపారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో క్లస్టర్, డివిజన్ వారీగా సాగు చేస్తున్న ఆయిల్ పామ్ పంటల పై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ వారి అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నదని, ఆయిల్ పామ్ సాగు ఎంతో లాభదాయకం అని, రైతులు ప్రత్యామ్నాయ పంట క్రింద ఆయిల్ పామ్ సాగు చేయాలని అన్నారు.
జిల్లాలో 2022-23 సంవత్సరానికి (2600) ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 689 మంది రైతులను గుర్తించి 2389 ఎకరాల రిజిస్ట్రేషన్ చేశామని, ఇప్పటి వరకు 349 రైతులకు చెందిన 1072 ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలు నాటడం జరిగిందని, మరో 570 ఎకరాలలో మొక్కలు నాటేందుకు డీడీ లు కట్టడం జరిగిందని అధికారులు వివరించారు.
అక్టోబర్ నెలలో సమావేశం నిర్వహించి ఆయిల్ పామ్ సాగు పెంపు లక్ష్యాలను నిర్దేశించుకున్నామని, గత మూడు నెలలుగా ఎంత మంది రైతులను కలిసి వారికి అవగాహన కల్పించారని, ఎంతమంది సుముఖంగా ఉన్నట్లు గుర్తించారు, ఎంత మంది రైతులు ముందుకు వచ్చారు అనే వివరాలను క్లస్టర్ల వారిగా ఆరా తీశారు.
ఆయిల్ పామ్ సాగుతో నాలుగు సంవత్సరాలలో ఆదాయం కోల్పోకుండా అంతర్గత పంటలు వేసి ఆదాయం పొందవచ్చని, ప్రభుత్వం ఎకరానికి రైతు బంధుకు అదనంగా సంవత్సరానికి 4200 సబ్సిడీ అందిస్తుందని, ఈ అంశాలను రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలో పెండింగ్ లో ఉన్న 1500 ఎకరాలలో ఫిబ్రవరి చివరి నాటికి ఆయిల్ పామ్ సాగు మొక్కలు నాటేలా వ్యవసాయ విస్తరణ అధికారులు లక్ష్యాలు నిర్దేశించుకొని పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఫిబ్రవరి చివరి నాటికి ఎట్టి పరిస్థితుల్లో జిల్లాకు కేటాయించిన లక్ష్యాలు పూర్తి చేయాలని , ఇప్పటికే మొక్కలకు డీడీ చెల్లించిన రైతుల నుంచి, డ్రిప్ కోసం సైతం డిడి తీసుకోవాలని, ఇప్పటి వరకు 570 ఎకరాల డీడీ తీసుకున్నామని, మరో 958 ఎకరాలకు సంబంధించి రైతుల నుంచి డీడీలను సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఆయిల్ పామ్ సాగు చేసేందుకు వీలుగా సబ్సిడీ పై డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎస్సీ, ఎస్టీ రైతులకు 100%, బీసీ, ఓసి రైతులకు 5 ఎకరాలోపు 90%, 5 ఎకరాలకు పైగా ఉన్నట్లైతే 80% సబ్సిడీ ఉందని, రైతులు వారి వాటా 10% కాని, 20% కాని జీఎస్టీ తో కలిపి డిడి తీయాలని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో 314 రైతులకు సంబంధించి 1101 ఎకరాలలో డ్రిప్ ఇరిగేషన్ మంజూరు చేసామని, వాటి లో ఇప్పటి వరకు 220 రైతులకు చెందిన 789 ఎకరాలలో డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు పూర్తి చేశామని, మిగిలిన భూమిలో డ్రిప్ ఏర్పాటు త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలో డ్రిప్ ఏర్పాటు కోసం 5 కంపెనీలు పని చేస్తున్నాయని, వాటి లో 20 మంది ఫీల్డ్ స్టాఫ్ ఉండాలని, ప్రస్తుతం 12 మంది మాత్రమే ఉన్నారని, 7 రోజుల్లో 8 మంది నియమించని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లాలోని క్లస్టర్లలో నిర్మించిన రైతు వేదికల్లో ఆయిల్ పామ్ సాగు సంబంధించి విస్తృత ప్రచారం, అవగాహన కార్యక్రమాలు కల్పించాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి జగన్ మోహన్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి, పెద్దపల్లి హార్టికల్చర్ అధికారి ఏ.జ్యొతి, రామగుండం, మంథని హార్టికల్చర్ అధికారి జె.శ్రీకాంత్, వ్యవసాయ శాఖ ఏ.డి.ఏ.లు, మండల వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
———————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.