లాభదాయక యూనిట్లు ఏర్పాటు చేయాలి … జిల్లా కలెక్టర్ కె. శశాంక.

లాభదాయక యూనిట్లు ఏర్పాటు చేయాలి … జిల్లా కలెక్టర్ కె. శశాంక.

కొత్తగూడ,
మహబూబాబాద్ జిల్లా, ఏప్రిల్ -27:

దళిత బంధు లబ్దిదారులు లాభదాయక యూనిట్ లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు.

బుధవారం నాడు కొత్తగూడలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన దళిత బంధు లబ్దిదారుల అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ కె. శశాంక ములుగు ఎమ్మెల్యే సీతక్క తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి, అట్టడుగున ఉన్న దళితుల జీవితంలో బలమైన మార్పులు తీసుకొని రావడానికి, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు దళిత కుటుంబానికి 10 లక్షలు సహాయం అందించడం జరుగుతున్నదని తెలిపారు. ఈ పది లక్షలలో 10 వేలు దళిత రక్షిత నిధికి మల్లించి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఆదుకోవడానికి ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుందని తెలిపారు.

ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ లో 12, గంగారం లో 7 మందిని దళిత బంధు లో ఎమ్మెల్యే ఎంపిక చేశారని, రానున్న రోజుల్లో మరింత మంది దళితులకు ఇచ్చే అవకాశం ఉన్నందున భవిష్యత్తులో మీరు వారికి రోల్ మోడల్ గా నిలవాలని తెలిపారు.

ఇంతకుముందు మనం రుణం కావాలంటే బ్యాంక్ ద్వారా సవాలక్ష నిబంధనలు, మన వంతుగా కొంత మొత్తం, సబ్సిడీ కొంత మొత్తంగా ఉండేదని, కానీ దళిత బంధు లో ఎటువంటి నిబంధనలు, తిరిగి చెల్లించే పద్ధతి లేకుండా 10 లక్షలు మీ ఖాతాలో జమ కావడం దేశంలో ఎక్కడా లేదని అన్నారు.

రకరకాల యూనిట్ ల కలయికతో ఒకటి కంటే ఎక్కువ, ఇద్దరు, ముగ్గురు కలిసి ఒకే యూనిట్ గా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. యూనిట్ లపై అధికారులు అవగాహన కల్పిస్తారని, క్షేత్ర పర్యటన చేయించి పూర్తి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

యూనిట్ లను ఏర్పాటు చేసుకొన్న అనంతరం అమ్మే ఆలోచన చేయవద్దని, అందుకు అవకాశం లేదని తెలిపారు. మీకు మంజూరైన నిధులు మీకే ఉంటాయని, కొంత మొత్తం తో ఒక యూనిట్ ఏర్పాటు చేసుకుంటే మిగిలిన మొత్తం వెళ్ళిపోతుంది అనే అనవసర సందేహాలు మనసు నుండి తొలగించాలని సూచించారు.

ఎమ్మెల్యే సూచనల మేరకు రెండు మండలాలకు చెందిన 19 మంది దళిత బంధు లబ్దిదారులకు అవగాహన కలిస్తున్నామని, అధికార యంత్రాంగం మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అవగాహన కలుస్తుంది అని, ఇతరులను చూసి, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని, పూర్తిగా అవగాహన పొంది లాభదాయక యూనిట్ ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా బలోపేతం అయి, మీతో పాటు పది మందికి ఉపాధి కల్పిస్తూ, ఆర్థికంగా నిలదొక్కుకుని భవిష్యత్తులో మీ వారసులకు మంచి భవిష్యత్తును అందించాలని తెలిపారు.

భవిష్యత్తులో మళ్ళీ వెనక్కి తిరిగి చూసే విధంగా కాకుండా, కుటుంబంలోని మహిళలతో, సభ్యులతో చర్చి మంచి నిర్ణయం తీసుకొని యూనిట్ ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు.

ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ, వెనకబడి ఉన్న రెండు మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే నియమం పాటిస్తూ దళిత బంధును అమలు చేయడం, రెండు మండలాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న జిల్లా మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ కు, జిల్లా కలెక్టర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రెండు మండలాల్లో 19 మందిని ఎంపిక చేసే సమయంలో మానసిక ఒత్తిడికి గురైనామని, దళితులు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున భవిష్యత్తులో నియోజకవర్గానికి ఐదు వేల మందికి వచ్చే విధంగా పథకాన్ని విస్తృతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 10 లక్షల ను పెట్టుబడిగా పెట్టీ లాభదాయక యూనిట్ లను ఏర్పాటు చేయాలని, మూస పద్ధతిలో యూనిట్ లను ఎంపిక చేసుకోరాదని తెలిపారు. ఆర్థికంగా ఎదుగుదల సాధించి వేలాది మందికి రోల్ మోడల్ గా నిలవాలని సూచించారు.

ఈ సందర్భంగా లబ్దిదారులు తాము ఏర్పాటు చేయదలచిన యూనిట్ ల వివరాలను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే కు వివరించారు.

పలు శాఖల జిల్లా అధికారులు వివిధ యూనిట్ లపై అవగాహన కల్పించారు. ముగ్గురు, నలుగురు కలిసి వ్యవసాయ పనులకు ఉపయోగపడే ట్రాక్టర్ మౌంటైన్డ్ కంబైన్డ్ హార్వెస్టర్ , మొక్కజొన్న నూర్పిడి యంత్రం, మల్టీ ఫంక్షనల్ రైస్ మిల్, ట్రాక్టర్ తో నడిచే కాంపాక్ట్ రౌండ్ర్ బెలర్ యూనిట్ లు అవగాహన కలిగి ఉండి ఏర్పాటు చేసుకోవాలని, ఫెర్టిలైజర్, పెస్టిసైడ్, సీడ్ షాప్ ఏర్పాటు చేసుకొనుటకు డిగ్రీ అర్హత వాళ్ళు ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఈడి- ఎస్సీ కార్పొరేషన్ బాలరాజు, మత్స్య శాఖ సహాయ సంచాలకులు బుచ్చి బాబు, వ్యవసాయ శాఖ అధికారి చత్రు నాయక్, ఇతర జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, దళిత బంధు నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, రెండు మండలాల జెడ్పీటీసీలు, ఎం.పి.పిలు, ప్రజాప్రతినిధులు, కొత్తగూడ తహశీల్దార్ నరేష్, ఎంపిడిఓ., గాంగారం తహశీల్దార్, ఎంపిడిఓ. లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post