లింగాల మండలం భౌరపూర్ చెంచుపెంటలో నేడు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ యల్. శర్మన్ అన్నారు.

పత్రికా ప్రకటన
తేది: 4-8-2021
నాగర్ కర్నూల్ జిల్లా
ఆదివాసీలయిన చెంచు సోదరుల పెంటల్లో వెళ్లి వారికి మెరుగైన వైద్య సేవలను అందించాలనే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ఆకాంక్షల మేరకు పాలమూరు యూనివర్సిటీ, రెడ్ క్రాస్ వారి సౌజన్యము లింగాల మండలం భౌరపూర్ చెంచుపెంటలో నేడు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ యల్. శర్మన్ అన్నారు. బుధవారం భౌరపూర్ చెంచు పెంటలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఏర్పాటు చేసిన ఉచిత మెగా మల్టీ లెవల్ వైద్య శిబిరానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల్ల అడవుల్లోని చెంచుపెంటల్లో జీవిస్తున్న చెంచులకు మెరుగైన వైద్యం, నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో గవర్నర్ దత్తత తీసుకోవాల్సిందిగా పాలమూరు యూనివర్సిటీ, రెడ్ క్రాస్ సంస్థను ఆదేశించడం జరిగిందన్నారు. చెంచుల ఆచార వ్యవహారాలు, వారి జీవన స్థితిగతులపై లోతైన అధ్యహ్నం చేసి మెరుగైన అవకాశాలను కల్పించడానికి ఇప్పటికే రెడ్ క్రాస్ సంస్థ, సామాజిక సేవా సంస్థలు ఇక్కడికి తరచుగా సందర్శించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చెంచు సోదరులకు మెరుగైన విద్యా వైద్యం ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ రోజు వైద్య శిబిరానికి నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, హైద్రాబాద్ నుండి అన్ని రకాల స్పెషలిస్ట్ డాక్టర్లు 29 మంది రావడం జరిగిందన్నారు. ఇందులో కార్డియాలజిస్ట్, పిడియాట్రిక్, గైనకలజిస్ట్, ఆర్థో, కంటి, పంటి, జనరల్ ఫిజిషియన్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లు ఉన్నారన్నారు. అనేక రకాల మందులు, కరోనా పరీక్షా కిట్లు, కరోన వ్యాక్సిన్, డయజ్ఞస్టిక్ సేవలు తీసుకురావడం జరిగిందన్నారు. చెంచు సోదరులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని, డాక్టర్ల సూచనలు పాటిస్తూ క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలని సూచించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రతి ఒకరు వ్యాక్సిన్ తీసుకోవాలని తెలియజేసారు. చెంచుపెంటల్లో తాగునీటికి పైప్ లైన్ ద్వారా మంచినీరు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎక్కడైనా సమస్యలు ఉంటే తక్షణమే మరమ్మతులు చేయించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మొబాయిల్ వాహనము ద్వారా వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. చెంచుల కోరిక మేరకు చెక్ డ్యాములు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలితజేశారు. ఆంత్రోపాలజిస్టు లను పంపించి చెంచుల జీవన విధానం వారికి అవసరమైన సేవలను అధ్యయనం చేయిస్తామని తెలియజేసారు.
కార్యక్రమంలో పాల్గొన్న అచ్ఛంపేట శాసన సభ్యులు , ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్ మాట్లాడుతూ అంతరించిపోతున్న ఆదివాసిలు, చెంచులను వారి సంస్కృతిని కాపాడుకోటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. ఇక్కడి కొంత మంది పిల్లలను చేవెళ్లలో చదివించడం జరుగుతుందన్నారు. నీట్ వంటి జాతీయస్థాయి పోటీ పరోక్షలో అర్హత సాధించినట్లు వెల్లడించారు. చెంచుపెంటలను గ్రామ పంచాయతీలుగా మార్చటం జరిగిందని, వారే సర్పంచులుగా తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. చెంచుల అభ్యున్నతికి చట్టాలు ఉన్నప్పటికిని వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లక్ష్మీకాంత్ రాథోడ్ మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ తమిళ సై ఆదేశాల మేరకు చెంచుపెంటలను దత్తత తీసుకొని యూనివర్సిటీ సామాజిక కార్యకర్తల ద్వారా, ఎన్. ఎస్.ఎస్ ద్వారా క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుచున్నాయన్నారు.
గవర్నర్ కార్యాలయం లైజన్ ఆఫీసర్ సీతారాములు మాట్లాడుతూ రాష్ట్రం లోని వివిధ జిల్లాలలో ఉన్న చెంచు పెంటలను రాష్ట్ర గవర్నర్ దత్తత తీసుకోవడం జరిగిందన్నారు. వీరికి పౌష్టికాహారం, నాణ్యమైన విద్యా, వైద్యం అందించేందుకు చర్యలు తీసుకివడం జరుగుతుందన్నారు.
జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్త శ్రీనివాస్ మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో దొరికే పళ్ళు, ఆకులలో అనేక పౌష్టిక ఆహార పదార్థాలు ఉన్నప్పటికిని చెంచు మహిళలు, పిల్లలు అనేక మంది రక్తహీనతతో బాధపడుతున్నారన్నారు. వారికి అవగాహన లేక అమ్మాయిలకు అబ్బాయిలకు చిన్న వయసులోనే పెళ్లి చేయడం, మత్తుపానియలకు బానిసలు కావడం ప్రధాన కారణం అన్నరు. పౌష్టికాహారం పై అవగాహన కల్పించడం, ఎన్నో పౌష్టిక విలువలు కలిగిన ఇప్ప పూల నుండి లడ్లు తయారు చేసి వారికి ఇవ్వడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యదర్శి మాదన్మోహన్ రావు మాట్లాడుతూ చెంచుల ఇంటివద్దకే వైద్యాన్ని అందించేందుకు ఇప్పటికే 6 సార్లు ఇంటింటికి వెళ్లి వైద్య సేవలు, మందులు అందించడం జరిగిందన్నారు. చెంచుల జీవన విధానాన్ని అధ్యయనం చేసి వారికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర గవర్నర్ ఆదేశాలతో రెడ్ క్రాస్ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
శిబిరానికి విచ్చేసిన చెంచులకు వైద్య పరీక్షలు, వైద్యం సేవలతో పాటు దుప్పట్లు, దోమ తెరలు, పళ్ళు, కూరగాయలు, శీతల పానీయాలు ఉచితంగా అందజేశారు. వైద్య శిబిరానికి వచ్చిన 250 మంది వైద్యం తీసుకున్నారు. అందులో ఎక్కువ శాతం మంది జ్వరం, కాలి నొప్పులు, పిల్లలకు జ్వరాలు, గర్భిణీలు, కంటి సమస్యల తో బాధపడుతున్న వారు వైద్యం తీసుకున్నారు. కొంతమంది వ్యాక్సిన్ తీసుకున్నారు.
ఈ కార్యక్రమానికి ఐ.యం.ఐ రాష్ట్ర అధ్యక్షులు డా. లవకుమార్ రెడ్డి, కార్యదర్శి బి. నరేందర్ రెడ్డి, సీనియర్ ప్రొఫెసర్ డా. గుట్టు శ్రీనివాస్, నాగర్ కర్నూల్ జిల్లా వైద్య అధికారి డా. సుధాకర్ లాల్, మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రిసూపరిండెంట్ డా. రాంకిషన్, ఐ.టి.డి.ఏ అధికారి అశోక్, డి.యఫ్.ఏ కిష్టా రెడ్డి, రెడ్ క్రాస్ నుండి లైన్ నటరాజ, రమేష్ రెడ్డి, పి.యు. ప్రొఫెసర్ మనోజ, స్థానిక సర్పంచ్ బాలగురువయ్య, గురువయ్య, పెద్దసంఖ్యలో చెంచులు తదితరులు పాల్గొన్నారు.
———————
జిల్లా పౌర సంబంధాల అధికారి, నాగర్ కర్నూల్ ద్వారా జారీ.

Share This Post